పేపర్ బ్యాలెట్‌పైనే పోలింగ్ జరపాలి
► ఈసీని కోరిన 16 పార్టీలు
► 13న సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలు ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లపై నమ్మకం కోల్పోయారనీ, కాబట్టి ఎన్నికల పోలింగ్‌ను పేపర్ బ్యాలెట్‌పైనే జరపాలని 16 రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం(ఈసీ)ను కోరాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయానికి అన్ని ఈవీఎంలకు వీవీపీఏటీ (ఓటు ఎవరికి పడిందో తెలుపుతూ రశీదులనిచ్చే యంత్రాలు)లను అమర్చేందుకు ఈసీకి తగినన్ని నిధులు ఇవ్వడం లేదంటూ కేంద్రంపై ఆరోపణలు చేశాయి. కాంగ్రెస్, బీఎస్పీ, డీఎంకే, టీఎంసీ, వామపక్షాలు తదితర పార్టీల నాయకులు ఈసీ ఉన్నతాధికారులను సోమవారం కలిశారు.
పార్లమెంటులో ప్రతిపక్షాల భేటీ
ఎన్నికల సంఘం వద్దకు వెళ్లేముందు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పార్లమెంటులో ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ చాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో.. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఎన్నికల సంఘాన్ని కలవాల్సిందిగా ప్రతిపక్షాలు నిర్ణయించాయి.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం తెలిసిందే. మహాభారతంలో కొడుకు దుర్యోధనుడు గెలవడానికి తండ్రి ధృతరాష్ట్రుడు సాయపడినట్లుగా...ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఈసీ తోడ్పాటునందిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. వీవీపీఏటీలు లేని ఈవీఎంలను ఎన్నికల్లో వాడడాన్ని సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లను అన్నింటినీ కలిపి సుప్రీంకోర్టు ఏప్రిల్ 13న విచారించనుంది. వీవీపీఏటీలు కలిగిన ఈవీఎంలనే ఎన్నికల్లో వాడాలంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత అతౌర్ రెహ్మాన్ వేసిన పిటిషన్‌ను సోమవారం విచారించేందుకు కోర్టు నిరాకరించింది.