శశికళ కూతురినంటూ.. కోటి రూపాయలకు టోకరా
తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ కూతురినంటూ ఓ మహిళ ఎన్నారై దంపతులను మోసం చేసి కోటి రూపాయలు వెనకేసుకుంది. ఆమెను సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు ఈ విషయమై గత సంవత్సరమే ఫిర్యాదు అందినా.. ఈ కేసు విచారణ విషయంలో పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. దాంతో ఇన్నాళ్లూ ఊరుకున్నారు.
భువనేశ్వరి అలియాస్ భువన అనే మహిళ అమెరికా నుంచి తమ పిల్లల చదువుల కోసం చెన్నై వచ్చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దంపతులు శ్రీనివాసన్, విజయలలితలతో స్నేహం చేసింది. ప్రభుత్వంలో పెద్దవాళ్లు తనకు బంధువులని చెప్పింది. ఆమె తన భర్త అళగేశ్వరన్తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది. చెన్నైలోని ప్రధాన కూడలిలో స్థలం కారుచవగ్గా ఇప్పిస్తానని చెప్పి వాళ్ల దగ్గర 10 లక్షల నగదు, 90 లక్షలకు చెక్కు తీసుకుంది. అయితే వాళ్లకు స్థలమేదీ రిజిస్టర్ చేయలేదు.దాంతో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదుచేయగా, ఎట్టకేలకు భువనను అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ఈ కేసులో మరికొందరు ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.