woman duped
-
బెంగళూరులో నయా స్కాం.. ఫేక్ స్క్రాచ్ కార్డ్‌తో రూ.18 లక్షలు దోపిడీ
డిజిటలైజేషన్ అనేక మార్పులు తీసుకొచ్చింది. మనిషి జీవితాన్ని సులభతరం చేసింది. కానీ దానికి పెరుగుతున్న ఆదరణతో పాటు, నేరాలు, మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. సామాన్యులను దోపిడీ చేసేందుకు స్కామర్లు కొత్త ట్రిక్స్‌ను ఉపయోగిస్తున్నారు.బెంగళూరులో కొత్త స్కామ్ బయటపడింది. డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం.. అన్నపూర్ణేశ్వరి నగర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ ఈ మోసానికి గురై రూ. 18 లక్షలు పోగొట్టుకుంది. ఈ స్కామ్‌లో మోసగాళ్లు ప్రసిద్ధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పేరుతో స్క్రాచ్ కార్డ్‌లను పంపుతారు. ఈ మహిళకు కూడా ఈ-కామర్స్ వెబ్సైట్ మీషో నుంచి పంపుతున్నట్లుగా స్క్రాచ్ కార్డ్ పంపారు.ఆమె కార్డును స్క్రాచ్ చేయగా, ఆమె 15.51 లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు వచ్చింది. ఆమె బహుమతిని క్లెయిమ్ చేయడానికి అందించిన నంబర్‌ను వెంటనే సంప్రదించింది. అవతలి వైపు వ్యక్తి స్క్రాచ్ కార్డ్ ఫోటోలు, గుర్తింపు రుజువును కోరారు. వారు చెప్పినట్లే ఆమె వివరాలను అందించింది. ఆ తర్వాత కర్ణాటకలో లాటరీ టిక్కెట్ల అక్రమం కారణంగా 30 శాతం పన్నులు ముందుగా చెల్లించాలని కేటుగాళ్లు ఆమెను నమ్మించారు. దీంతో బాధితురాలు ఫిబ్రవరి, మే మధ్య అనేకసార్లు మొత్తం రూ. 18 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసింది. అయితే ఆ తర్వాత ఆమెకు తదుపరి సమాచారం అందకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
సినిమా కాదు రియల్; ఆమె.. 11 మంది భర్తలు!
నోయిడా: మ్యాట్రిమనీ ద్వారా పెళ్లి పేరుతో సంపన్నులకు వల వేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత కొన్ని రోజులు వారితో కాపురం చేయడం.. సమయం చూసుకుని డబ్బులు, నగదుతో ఉడాయించడం.. తర్వాత మరొకరిని పెళ్లి చేసుకోవడం.. ఇదీ తంతు. చివరకు భర్త ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారించగా, అసలు విషయం బయటపడింది. సినిమా కథను తలపించేలా ఉన్న ఈ క్రైం స్టోరీకి దేశ రాజధాని ఢిల్లీ శివారు నోయిడాలో ముగింపు పడింది. నిందితురాలయిన 28 ఏళ్ల మేఘ భార్గవ్‌ను శనివారం నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి డబ్బు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కోచికి చెందిన లోరెన్ జస్టిన్ అనే వ్యక్తి గత అక్టోబరులో తన భార్య మేఘ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేఘతో పాటు 15 లక్షల రూపాయల డబ్బు, బంగారు ఆభరణాలు మాయమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేరళ పోలీసుల బృందం నోయిడా పోలీసుల సాయంతో విచారణ చేసి.. రెండు నెలల తర్వాత మేఘతో పాటు ఆమె సోదరి ప్రాచి, సోదరి భర్త దేవేంద్ర శర్మలను అదుపులోకి తీసుకున్నారు. మేఘ.. జస్టిన్ కంటే ముందు కేరళకు చెందిన మరో ముగ్గురిని పెళ్లి చేసుకుని వారిని మోసం చేసినట్టు విచారణలో తేలింది. మేఘ మ్యాట్రిమనీ ద్వారా విడాకులు తీసుకున్న, ఒంటరిగా ఉన్న సంపన్నులను గుర్తించి పెళ్లి చేసుకుందని, కొన్ని నెలల తర్వాత సమయం చూసుకుని ఇంట్లోని విలువైన వస్తువులు, డబ్బు తీసుకుని పారిపోయిందని పోలీసులు తెలిపారు. వధువు కావాలని ప్రకటన ఇచ్చిన చాలా మంది ఆమె మాయలో పడ్డారని చెప్పారు. మేఘ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్. ఆమె సోదరి భర్త దేవేంద్ర సాయంతో పెళ్లి పేరుతో 11 మందిని మోసం చేసింది. -
శశికళ కూతురినంటూ.. కోటి రూపాయలకు టోకరా
తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ కూతురినంటూ ఓ మహిళ ఎన్నారై దంపతులను మోసం చేసి కోటి రూపాయలు వెనకేసుకుంది. ఆమెను సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు ఈ విషయమై గత సంవత్సరమే ఫిర్యాదు అందినా.. ఈ కేసు విచారణ విషయంలో పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. దాంతో ఇన్నాళ్లూ ఊరుకున్నారు. భువనేశ్వరి అలియాస్ భువన అనే మహిళ అమెరికా నుంచి తమ పిల్లల చదువుల కోసం చెన్నై వచ్చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దంపతులు శ్రీనివాసన్, విజయలలితలతో స్నేహం చేసింది. ప్రభుత్వంలో పెద్దవాళ్లు తనకు బంధువులని చెప్పింది. ఆమె తన భర్త అళగేశ్వరన్తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది. చెన్నైలోని ప్రధాన కూడలిలో స్థలం కారుచవగ్గా ఇప్పిస్తానని చెప్పి వాళ్ల దగ్గర 10 లక్షల నగదు, 90 లక్షలకు చెక్కు తీసుకుంది. అయితే వాళ్లకు స్థలమేదీ రిజిస్టర్ చేయలేదు.దాంతో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదుచేయగా, ఎట్టకేలకు భువనను అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ఈ కేసులో మరికొందరు ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.