సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి ఇంటికి 2018, డిసెంబర్ నెలాఖరుకల్లా కేంద్ర సౌభాగ్య పథకం కింద విద్యుత్ సౌకర్యం కల్పించడమేకాకుండా 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సౌకర్యం అందిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఇటీవల ప్రకటించారు. దేశంలోని ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించడం అంటే ముందుగా దేశంలోని విద్యుత్ సౌకర్యం లేని నాలుగు కోట్ల ఇళ్లకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలి. ఆ తర్వాత వారికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలే విద్యుత్ కోతను ఎదుర్కొంటున్న నేటి పరిస్థితుల్లో మంత్రి ఆర్కే సింగ్ చేసిన ప్రకటనను అమలు చేయడం సాధ్యమయ్యే పనేనా?!
ముంబైలోని శివారు ప్రాంతాలు, నవీ ముంబై, థానె ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు మూడు గంటలు విద్యుత్ కోత ఉంటున్న విషయం తెల్సిందే. ఆ రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంటులకు ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ఈ పరిస్థితి కొనసాగుతోంది. మిగులు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ కొరతను అధిగమించవచ్చని కేంద్రం భావిస్తోంది. అసలు ఎందుకు విద్యుత్ ప్లాంట్‌లు మిగులు విద్యుత్ ఉత్పత్తి చేయలేక పోతున్నాయనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వస్తాయి. ఈ అంశాలను అర్థం చేసుకోవాలంటే ముందుగా విద్యుత్ ఉత్పత్తిదారులు లేదా జనరేటర్ల నుంచి వినియోగదారుల వద్దకు విద్యుత్ సరఫరా ఎలా జరుగుతుందో, ఆ చైనా ఎలా పనిచేస్తుందో ముందుగా పరిశీలించాల్సి ఉంటుంది.
విద్యుత్ ఉత్పత్తిదారుల నుంచి చౌక రేటును విద్యుత్‌ను కొనుగోలు చేసి, దాన్ని వినియోగదారుడికి సరసమైన ధరకు అందించడం విద్యుత్ పంపిణీ కంపెనీల బాధ్యత. ఈ కంపెనీలను డిస్కామ్‌లని పిలుస్తాం. సాంకేతిక, ఇతర సమస్యల కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్ర నష్టం జరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తిదారుడి నుంచి వినియోగదారుడి వద్దకు విద్యుత్‌ను తీసుకరావడంలో నష్టం వాటిల్లుతోంది. కొన్ని రాష్ట్రాల ఈ నష్టం 30 శాతం వరకు ఉండడంతో చాలా డిస్కామ్‌లు తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయి. 2015, మార్చి నాటి అంచనాల ప్రకారం భారత్‌లోని డిస్కామ్‌ల నష్టాలు 3.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకొని వాటి మొత్తం అప్పులు 4.3 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈ కంపెనీలు ఈ అప్పులపై 14 నుంచి 15 శాతం వరకు వడ్డీలు చెల్లిస్తున్నాయి.
రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చాలా డిస్కామ్‌లు విద్యుత్ టారిఫ్‌లను పెంచలేకపోతున్నాయి. నష్టాలను భర్తీ చేసుకోలేక పోతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2015లో ‘ఉజ్వల్ డిస్కామ్ హామీ యోజన’ పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని ఉదయ్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ పథకం కింద డిస్కామ్‌ల నష్టాల్లో 75 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని, ఇందులో భాగంగా మొదటి సంవత్సరం 50 శాతం అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, రెండో సంవత్సరం మిగతా 25 శాతం అప్పులను చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. భవిష్యత్తులో అప్పులు పెరగకుండా విద్యుత్ టారిఫ్‌లను పెంచాలని కూడా కోరింది. అలాగే విద్యుత్ సరఫరాలో నష్టాన్ని సాంకేతికంగా, వాణిజ్యపరంగా కూడా 2019, మార్చి నాటికి 15 శాతానికి కట్టడి చేయాలని కూడా సూచించింది. అందుకు ట్రాన్స్‌ఫార్మర్లను అప్‌గ్రేడ్ చేయాలని, స్మార్ట్ మీటర్లను తీసుకరావాలని కోరింది.
కేంద్రం ఈ ఉదయ్ స్కీమ్‌ను తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎక్కువ విద్యుత్‌ను వినియోగించే పది రాష్ట్రాల్లో కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే విద్యుత్ టారిఫ్‌లను పెంచాయి. మిగతా ఏడు రాష్ట్రాల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయింది. కేంద్రం ప్రకటించిన ఉదయ్ స్కీమ్‌లోకి 2016, జూలై నాటికి 14 రాష్ట్రాలు చేరినప్పటికీ మూడు రాష్ట్రాల డిస్కామ్‌ల పరిస్థితే మెరగుపడింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల డిస్కామ్‌ల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం కూడా డిస్కామ్‌లు 2.3 లక్షల కోట్ల రూపాయల నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
వీటిని భర్తీ చేసుకునేందుకు డిస్కామ్‌లు విద్యుత్ టారిఫ్‌లను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించడం లేదు. గుజరాత్‌లో బీజేపీయే అధికారంలో ఉన్నప్పటికీ రానున్న అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని టారిఫ్‌లను పెంచలేదు. అలాగే మరో కారణంగా తెలంగాణ ప్రభుత్వం పెంచేందుకు అనుమతివ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ కొనుగోలు పెంచి నష్టాలను కూడగట్టుకోవడం కన్నా తక్కువ విద్యుత్‌ను కొనుగోలు చేయడం, తక్కువ విద్యుత్‌ను సరఫరా చేయడం ఉత్తమమని డిస్కామ్‌లు భావిస్తున్నాయి. ఫలితంగా విద్యుత్ కోతలు ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2018, డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వాలనే లక్ష్యం నెరవేరాలంటే ఎంత కష్టం, ఎంత నష్టం ?
Comments
Please login to add a commentAdd a comment