సాక్షి, న్యూఢిల్లీ: నిర్దేశిత మూడు విద్యుత్ సంస్కరణలు అమలు చేసి, మధ్యప్రదేశ్ తర్వాత విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసిన రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తద్వారా జీఎస్‌డీపీలో 0.15 శాతం మేర.. అంటే రూ.1,515 కోట్ల మేర అదనపు రుణాలు స్వీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి పొందింది. కోవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా జీఎస్‌డీపీలో 2 శాతం అదనంగా రుణాలు తీసుకునేందుకు పరిమితిని పెంచింది. అయితే ఇందులో 1 శాతానికి షరతులు విధించింది. పౌర కేంద్రీకృత సంస్కరణలు అమలు చేస్తే ఈ 1 శాతం రుణ పరిమితినీ వాడుకోవచ్చని పేర్కొంది. (చదవండి: టీడీపీ దౌర్జన్యం.. కర్రలతో దాడి..)
రేషన్ కార్డు దేశంలో ఎక్కడైనా వినియోగించుకునేలా వ్యవస్థను రూపొందించడం, సులభతర వాణిజ్య సంస్కరణలు, పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలు, విద్యుత్ సంస్కరణల్లో ఒక్కో సంస్కరణ అమలు చేస్తే జీఎస్‌డీపీలో 0.25 శాతం మేర అదనపు రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలకు వీలు కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మూడు సంస్కరణలు అమలు చేసి తాజాగా విద్యుత్ సంస్కరణల అమలు పూర్తి చేసింది. (చదవండి: అపహాస్యం: మాజీ మంత్రి సైతం పచ్చ కండువాతోనే..)
విద్యుత్ సంస్కరణలు మూడింటిలో ఒకటైన విద్యుత్ సబ్సిడీల ప్రత్యక్ష నగదు బదిలీని 2020 డిసెంబర్ 31లోపు ఒక్క జిల్లాలోనైనా పూర్తి చేస్తే జీఎస్‌డీపీలో 0.15 శాతం మేర అదనపు రుణాలకు అర్హత లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంస్కరణను అమలు చేసింది. 2020 సెప్టెంబర్ నుంచి విద్యుత్ రాయితీలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇస్తూ శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 1 కల్లా అన్ని జిల్లాల్లో ఇలాగే అమలు చేయనుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అమలు చేసిన సంస్కరణల కారణంగా రూ.9,190 కోట్ల మేర అదనపు రుణాలకు అర్హత లభించింది.
Comments
Please login to add a commentAdd a comment