అమ్ముడు అగ్గువ.. కొనుడు పిరం! | AP to sell power from telangana low price | Sakshi
Sakshi News home page

అమ్ముడు అగ్గువ.. కొనుడు పిరం!

Published Wed, Jul 13 2016 3:57 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

అమ్ముడు అగ్గువ.. కొనుడు పిరం! - Sakshi

అమ్ముడు అగ్గువ.. కొనుడు పిరం!

- తెలంగాణకు గుదిబండగా ఏపీ కరెంట్
- రాష్ట్రం నుంచి తక్కువ ధరకే విద్యుత్ కొంటున్న ఏపీ
- అక్కడ్నుంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న తెలంగాణ
- ధరల వ్యత్యాసంతో రాష్ట్రంపై ఏటా రూ.720 కోట్ల భారం
- విద్యుత్ పంపకాల కొనసాగింపుపై పునఃపరిశీలన చేయాలంటున్న నిపుణులు

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ తెలంగాణకు పెనుభారంగా మారింది. అదే సమయంలో తెలంగాణ విద్యుత్ ఏపీకి వరంలా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ వాటాల పంపకాల్లో భాగంగా గత రెండేళ్లుగా ఏపీ నుంచి అధిక ధరతో విద్యుత్ కొనుగోలు చేస్తున్న తెలంగాణ.. తక్కువ ధరకు లభిస్తున్న తమ విద్యుత్‌ను ఏపీకి విక్రయిస్తోంది. ఇలా ఏపీ నుంచి ఎక్కువ ధరతో విద్యుత్‌ను కొనుగోలు చేస్తుండడంతో తెలంగాణపై ఏటా వందల కోట్ల భారం పడుతోంది. తెలంగాణ ట్రాన్స్‌కో వర్గాల అంచనా ప్రకారం ఏటా రాష్ట్రం రూ.720 కోట్లను నష్టపోతోంది.
 
 ఏపీ నుంచి 9 వేల మిలియన్ యూనిట్లు..
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఏపీలోని జెన్‌కో ప్లాంట్ల విద్యుత్‌లో తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం వాటాలున్నాయి. ఈ వాటాల ప్రకారం రాష్ట్రంలోని 2,882.5 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ల నుంచి ఏపీకి 1,329 మెగావాట్లు, తెలంగాణకు 1,553 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అలాగే ఏపీలోని 2,810 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ల నుంచి తెలంగాణకు 1,514 మెగావాట్లు, ఏపీకి  1,296 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. తెలంగాణ ప్లాంట్ల విద్యుత్ ధరలు యూనిట్‌కు రూ.2.79 నుంచి రూ.5.23 వరకు ఉండగా.. ఏపీ విద్యుత్ ప్లాంట్ల ధరలు యూనిట్‌కు రూ.4.13 నుంచి రూ.6.04 వరకు ఉన్నాయి. ఈ ఏడాది ఏపీ నుంచి 9 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రం కొనుగోలు చే యనుంది.
 
 తెలంగాణలోని విద్యుత్ ప్లాంట్ల ధరలతో పోలిస్తే సగటున ఒక్కో యూనిట్‌పై 0.80 పైసలను అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన తెలంగాణ ఏటా రూ.720 కోట్లు నష్టపోతోందని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక 2016-17లో తెలంగాణ జెన్‌కో థర్మల్ ప్రాజెక్టుల నుంచి 11,215.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఈఆర్సీ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు అనుమతిచ్చింది. ప్లాంట్ల వారీగా ఈఆర్సీ ఖరారు చేసిన విద్యుత్ ధరల ప్రకారం ఇందుకు రూ.4,758.96 కోట్ల వ్యయం కానుంది. అలాగే ఏపీ జెన్‌కో థర్మల్ ప్రాజెక్టుల నుంచి 9,237.76 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్లకు అనుమతి ఇవ్వగా అందుకు రూ.4,312.56 కోట్ల వ్యయం కానుండడం గమనార్హం.
 
 పంపకాలు రద్దు చేసుకుంటేనే మేలు
 ఏపీ విద్యుత్ రాష్ట్రానికి గుదిబండగా మారుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ వాటాల పంపకాల కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులతో పాటు ట్రాన్స్‌కో వర్గాలూ అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ ప్రాజెక్టు అందుబాటులోకి రాగా.. 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ ప్లాంట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపకాలను రద్దు చేసుకుంటే మేలని విద్యుత్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. థర్మల్, జల విద్యుత్‌తోపాటు ఇతర రకాల ప్లాంట్లలో సైతం తెలంగాణ, ఏపీకి 53.89:46.11 నిష్పత్తిలో వాటాలుండగా.. కేవలం థర్మల్ విద్యుత్‌కు మాత్రమే అమలు చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య జల విద్యుత్ వాటాల పంపకాలు లేవు. అదే తరహాలో థర్మల్ విద్యుత్  వాటాలను సైతం తెలంగాణ పక్కన పెట్టే అంశాన్ని పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
 తెలంగాణ ఈఆర్సీ ఖరారు చేసిన ధరల ప్రకారం ఏపీ జెన్‌కో ప్రాజెక్టుల నుంచి రాష్ట్ర డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్ ధరలు, అలాగే తెలంగాణ జెన్‌కో ప్రాజెక్టుల నుంచి ఏపీ డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్ ధరలు ఇవీ.. (ధర యూనిట్‌కు రూ.ల్లో)
      2015-16    2016-17
 ఏపీ జెన్‌కో ప్లాంట్లు
 వీటీపీఎస్-1,2,3    3.91    4.13
 వీటీపీఎస్-4     4.88    4.57
 ఆర్టీపీపీ-1     4.71    4.87
 ఆర్టీపీపీ-2    5.48     5.48
 ఆర్టీపీపీ-3    6.28     6.04
 తెలంగాణ జెన్‌కో ప్లాంట్లు
 కేటీపీఎస్-ఏ    3.82    3.79
 కేటీపీఎస్-బీ    3.83    3.79
 కేటీపీఎస్-సీ    3.79    3.79
 కేటీపీఎస్-5     3.07    2.79
 కేటీపీఎస్-6    5.30    4.44
 ఆర్టీఎస్-బీ    4.50    4.42
 కేటీపీపీ-1     4.50    4.36
 కేటీపీపీ-2    7.05    5.23

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement