బెంగళూరు : రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై వ్యాఖ్యలు చేసిన విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నటుడు ప్రకాశ్‌రాజ్ మద్దతు పలికారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ మహిళా వ్యతిరేకి కాదు. ఇటీవలే ఓ ట్రాన్స్‌జెండర్‌ను కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ కార్యదర్శిగా నియమించారు కూడా. ఆయన వ్యాఖ్యల్ని ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటారు. రఫేల్ ఒప్పందం గురించి మోదీ ఇంతవరకు జవాబు చెప్పకపోవడం, పార్లమెంటులో ఈ విషయం గురించి మాట్లాడకపోవడం నిజం కాదా’ అంటూ ప్రశ్నించారు.
కాగా జైపూర్‌లో ఈ నెల 9న నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే క్రమంలో రాహుల్ నిర్మలా సీతారామన్‌పై వ్యాఖ్యలు చేశారు. ‘పార్లమెంట్‌లో రఫేల్ ఒప్పందం గురించి చర్చ జరిగే సమయంలో మోదీ పారిపోయి తనను కాపాడమని ఓ మహిళ (నిర్మలా సీతారామన్)ను కోరారు. ఆయన తనను తాను కాపాడుకోలేకపోయారు’అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ రాహుల్‌కు గురువారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇక ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తున్న ప్రకాశ్‌రాజ్ ఇటీవలే తన రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సార్వత్రిక ఎన్నికల బరిలో నిలుస్తానని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లతో ప్రకాశ్‌రాజ్ భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment