సర్పంచి నుంచి ఐదోసారి సీఎంగా..
చండీగఢ్: ఆయన సామాన్య కుటుంబంలో జన్మించారు. చిన్న వ్యవసాయం వారి వృత్తి. అలాంటి కుటుంబంలో నుంచి తొలుత సర్పంచిగా తర్వాత ఎమ్మెల్యే.. అనతికాలంలోనే ముఖ్యమంత్రి.. ఒకసారి కాదు.. ఏకంగా ఐదు సార్లు.. ప్రస్తుతం ఆ హోదాలోనే ఉన్నారు. ఆయనే పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్(89). ఆయన ఇప్పుడు ఓ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. దేశంలో అతి పెద్ద వయసులో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు. నేడు (గురువారం) ఆయన 89వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుట్టిన రోజు సందర్భంగా ఆయన శుక్రవారం మోగా జిల్లాలో శిరోమణి అకాళీదల్ ఏర్పాటుచేసిన అతిపెద్ద బహిరంగ సభలో ప్రభుత్వం తరుపున మాట్లాడనున్నారు. పంజాబ్‌లోని మాలౌట్ సమీపంలోగల అబుల్ ఖురానా అనే గ్రామంలో 1927 డిసెంబర్ 8 బాదల్ జన్మించారు. 1970లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రస్తుతం సీఎంగా కొనసాగడం ఇది ఐదోసారి. 2007 నుంచి పంజాబ్‌లో అధికారం ఆయనదే.
మోరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో 1977లో కొద్ది కాలం కేంద్ర మంత్రిగా పనిచేశారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన బాదల్ భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన 1947లోనే తొలిసారి సర్పంచిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పంజాబ్ అసెంబ్లీకి 1957లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపికయ్యారు. ఈయనకు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కూడా మోదీ ప్రభుత్వం అందించింది. దాదాపు 70ఏళ్లుగా పంజాబ్ సిక్కు రాజకీయాల్లో బాదల్‌ది తిరుగులేని ప్రస్థానం.