ప్రణబ్‌జీ నా గురువు!
నా వేలు పట్టుకుని అవగాహన కల్పించారు: మోదీ
- రాష్ర్టపతి భవన్‌లో మ్యూజియం రెండో దశ ప్రారంభం
న్యూఢిల్లీ : ‘రెండేళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు.. ఈ ఢిల్లీ ప్రపంచం, ఈ వాతావరణం అంతా నాకు కొత్త. అప్పటినుంచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాకు ఒక గురువులా, సంరక్షకుడిలా, మార్గదర్శిలా నిలిచారు. నా వేలు పట్టుకుని పలు కీలకాంశాల్లో నాకు అవగాహన కల్పించారు. ఆ అదృష్టం లభించిన అతికొద్ది మందిలో నేనొకడిని’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కొనియాడారు. రాష్ట్రపతిగా ప్రణబ్ బాధ్యతలు స్వీకరించి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. రాష్ట్రపతి భవన్‌లోని మ్యూజియం రెండో దశను మోదీ సోమవారం ప్రారంభించారు. చరిత్ర పరిరక్షణకు రాష్ట్రపతి తీసుకుంటున్న చర్యలను ప్రధాని ప్రశంసించారు.
సుదీర్ఘప్రజా జీవితంలో దేశానికి ప్రణబ్ గొప్పగా సేవలందించారన్నారు. ‘నా రాజకీయ నేపథ్యం.. ప్రణబ్‌జీ రాజకీయ నేపథ్యం వేర్వేరు. రెండు విభిన్న నేపథ్యాలున్న వ్యక్తులు ఈ ప్రజాస్వామ్యంలో కలిసికట్టుగా పనిచేయడం ఎలా సాధ్యమవుతుందో ప్రణబ్‌జీతో కలిసి పనిచేస్తే అర్థమవుతుంది’ అని పొగడ్తల్లో ముంచెత్తారు. దేవాలయాల్లోని ప్రతిమలు రాతితోనే తయారైనప్పటికీ.. ప్రజల భక్తి వాటిని దైవాలుగా మార్చిందని, అలాగే చారిత్రక ప్రదేశాల్లోని రాళ్లు.. చరిత్రను కళ్లకు గడుతూ భవిష్యత్తులోకి తీసుకెళ్తాయన్నారు.
ప్రణబ్ మాట్లాడుతూ.. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించకముందు రాష్ట్రపతి భవన్ గురించి తనకు కొద్దిగానే తెలుసని, భవన్‌లోని భోజన శాల, అశోకాహాల్, స్టడీహాళ్లను మాత్రమే చూశానని గుర్తు చేసుకున్నారు. 1950లో బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారతదేశ ప్రజాస్వామ్యం క్రమక్రమంగా బలోపేతమవుతూ వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ తదితరులు పాల్గొన్నారు. రెండో దశ మ్యూజియంలో.. రాష్ట్రపతి భవనం నిర్మాణం, అందులో నివసించిన బ్రిటిష్ వైస్రాయ్‌లు, స్వాతంత్య్ర పోరాట గాథలు, స్వాతంత్య్రం అనంతరం 13 మంది రాష్ట్రపతుల జీవిత విశేషాలు.. మొదలైనవాటిని ఆధునిక సాంకేతిక హంగులతో తీర్చిదిద్దారు.