సాక్షి, న్యూఢిల్లీ : దేశ 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని హోదాలో ఐదవ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మోదీ ప్రకటించారు. ఈ పథకం ద్వారా తొలి విడతగా 10 కోట్ల మందికి ఉచిత ఆర్యోగ సేవలను అందిచనున్నట్లు ప్రధాని తెలిపారు. సెప్టెంబర్ 25 నుంచి ఈ పథకం దేశ వ్యాప్తంగా అమలువుతోందని, దేశంలో ఆరోగ్య సమస్యలను రూపుమాపడం కోసం ఈ పథకం ఉపకరిస్తుందని పేర్కొన్నారు.
అభివృద్దిలో దేశం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోందని, యావత్ దేశం విశ్వాసంతో తొణకిసలాడుతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. బాపూజీ నేతృత్వంలో ఎందరో వీరులు దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ‘‘ఎందరో వీరులు ఎవరెస్ట్ శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన గిరిజన బిడ్డలు కూడా ఎవరెస్ట్‌పై జాతీయ జెండాను ఎగరవేసి దేశ ఔనత్యాన్ని మరింత ఇనుమడింపచేశారు. జలియన్‌వాలా బాగ్ మహా విషాదానికి వందేళ్లు పూర్తి అయ్యాయి. మన దేశ వీరుల త్యాగాలకు ఆ ఘటన నిదర్శనం. మన స్వేచ్ఛ కోసం పోరాడిన వీరులకు వందనాలు. త్రివర్ణ పతాకం మరింత స్ఫూర్తిని ఇస్తోంది. 125 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవెర్చేందుకు కృషి చేస్తున్నాం. గడిచిన నాలుగేళ్లలో ఎన్నో సవాళ్లును అధిగమించా. దేశంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని పట్టుదలతో ఉన్నాం. దాని కోసం అహర్నిషలు కృషి చేస్తున్నాం. ఇప్పటికి దేశ వ్యాప్తంగా పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. బాలికలు దేశ గౌరవాన్ని మరింత పెంచుతున్నారు. వారు ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తు.. దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు’’
మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ఇటీవల పార్లమెంట్‌లో సామాజిక న్యాయం సాధించాం. చారిత్రక బీసీ బిల్లుకు రాజ్యాంగ బద్దత కల్పించాం. దళితులు, మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అణగారిన వర్గల అభివృద్ధికి మేం కృషి చేస్తున్నాం. దేశం నా వెంట ఉంది. కష్ట సమయాల్లో నా వెంటే ఉంటుందన్న నమ్మకం నాకుంది. దేశ యువతి ప్రగతి అర్ధాన్నే సరికొత్తగా నిర్వచించారు. యువత బీ.పీ.ఓలను ప్రారంభిస్తున్నారు. దేశంలో మౌలిక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మూడు లక్షల గ్రామాల్లో డిజిటల్ ఇండియా కార్యాక్రమాలు జరుగుతున్నాయి. యువత తొడ్పాటుతో దేశం మరితం ముందుకెళ్తోంది. 12 ఏళ్లకు ఒకసారి పుష్పించే నిలగిరి పుష్పంలా దేశం వికసిస్తోంది. దేశ వ్యాప్తంగా ఆహార దాన్యాల ఉత్పతి గణనీయంగా పెరిగింది. ఓ వైపు వర్షాలు పడుతున్నాయన్న అనందం.. మరో వైపు అధిక వర్షాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈశాన్య భారతం ఢిల్లీకి దూరం అన్న భావాన్ని పూర్తిగా చెరిపివేశాం’’
దేశం ఆహార ధాన్యాలతో పాటు మొబైల్ ఫోన్ల్‌ను ఉత్పతి చేస్తోంది. ఎల్పీజీ గ్యాస్, విద్యుత్, మరుగుదొడ్లను నిర్మిస్తున్నాం. ఎవరెన్ని విమర్శలు చేసినా జీఎస్టీని విజయవంతగా అమలుచేశాం. రానున్న 30 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించబోతున్నాం. ప్రపంచ దేశాలు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. అవినీతిని అరికట్టాం. పౌరసరఫరాల్లో అవకతవకలను నివారించాం. తొలిసారిగా సుప్రీంకోర్టులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఎన్నికయ్యారు. ఇది భారతీయ మహిళా శక్తికి నిదర్శనం. మహిళల పట్ల నేరాలకు పాల్పడే వాళ్లను కఠినంగా శిక్షిస్తున్నాం. చట్టం అన్నింటికన్నా ఉన్నతమైనది’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment