ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్. సామాన్యుల నుంచి స్టార్ హీరోల వరకూ ప్రియా ప్రకాశ్ కన్నుగీటుకి ఫిదా అయ్యారు. అయితే ఆ కన్నుగీటు ఆమెకు పేరుతో పాటు సమస్యలు కూడా తెచ్చిపెట్టింది. ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలోని ఓ పాటలో ప్రియా ప్రకాశ్ ముస్లింల మనోభావాలను కించపరిచేలా ప్రవర్తించిందంటూ కొందరు ముస్లింలు ఆమెపై కేసు వేసిన సంగతి తెలిసిందే.
దాదాపు నాలుగు నెలల పాటు విచారణలో ఉన్న ఈ కేసులో ప్రియా ప్రకాశ్‌కు ఊరటనిస్తూ శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రియా ప్రకాష్‌పై కేసును కొట్టివేయడమే కాక.. కేసు వేసిన వారిని ఉద్దేశిస్తూ ‘మీకేం పని లేదా.. ప్రతి దానికి ఇలా కేసులు వేసుకుంటూ కూర్చుంటారా’ అంటూ చివాట్లు పెట్టింది. సుప్రీం కోర్టు తీర్పు ఫలితంగా ఇన్నాళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తోన్న ‘ఒరు అదార్ లవ్’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఒమర్ లులు దర్శకత్వంలో వచ్చిన ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలోని ‘మాణిక్య మలరయ’ పాటలో ప్రియ కన్ను కొట్టిన సన్నివేశాలు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ పాట కేరళకు చెందిన ముస్లిం సంప్రదాయపు గీతం అని, ఇందులో ప్రియ కన్నుకొట్టడం అసభ్యకరంగా ఉందంటూ పలువురు ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రియా ప్రకాశ్ మీద కేసు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment