నటి ప్రియాంక చోప్రా వివాదాస్పద వ్యాఖ్యలు
నటి ప్రియాంక చోప్రా వివాదాస్పద వ్యాఖ్యలు
Published Thu, Sep 14 2017 10:23 AM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సిక్కిం రాష్ట్రం అల్లర్లకు నెలవుగా మారిందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు.
ప్రియాంక చోప్రా నిర్మాతగా మారి పహునా అనే చిత్రాన్ని నిర్మించారు. సిక్కిం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న క్రమంలో ఇద్దరు చిన్నారి శరణార్థుల మధ్య చోటు చేసుకునే పరిణామాలతో ఉద్వేగపూరితంగా తెరకెక్కించారు. పహునాను టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా.. ప్రశంసలు దక్కాయి. దీంతో మీడియా సమావేశంలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ... ‘సిక్కం ఈశాన్య భారతంలో ఓ చిన్న రాష్ట్రం. అక్కడ ఫిల్మ్ఇండస్ట్రీ లేదు.. కనీసం సినిమాలు తీసేందుకు కూడా ఎవరూ ముందుకు రారు. అందుకు కారణం నిత్యం అక్కడ తిరుగుబాటులు, అల్లర్లు చెలరేగి ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది. అయినా అతి కష్టం మీద ఇబ్బందులను ఎదుర్కుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ ప్రాంతం నుంచి వచ్చిన తొలిచిత్రం పహునానే’ అంటూ ప్రియాంక చెప్పుకొచ్చారు.
దీంతో సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లగక్కుతున్నారు. సిక్కిం చాలా ప్రశాంతతో కూడుకున్న రాష్ట్రమని కొందరు కామెంట్ చేస్తే.. అసలు సిక్కిం ఎక్కడ ఉంటుందో ప్రియాంకకు తెలుసా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు సిక్కిం ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ప్రియాంకకు సూచిస్తున్నారు. కాగా, సిక్కిం నుంచి ఈ మధ్య చాలా మంచి మంచి సినిమాలే వస్తున్నాయి. అందులో ప్రశాంత్ రసయిలి లాంటి టాలెంటెడ్ దర్శకుడు తీసిన కథ, ఆచార్య చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ యేడాది సిక్కిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ధోక్బు కూడా పలు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంది.
Advertisement