పాత్రలో లీనమైపోయా
ముంబై: ‘మేరీ కోమ్’ పాత్రలో తాను లీనమైపోయానని, ఒకవేళ ఇదికనుక బాక్సాఫీస్ వద్ద బోల్తాపడితే తన హృదయం గాయపడుతుందని బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా చెప్పింది. ప్రముఖ భారతీయ బాక్సర్ మేరీకోమ్ జీవిత గాధను ‘మేరీకోమ్’ సినిమాగా రూపొందుతోంది. ‘ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ఈ పాత్రకు తగు న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేశా.
జీవితంలో అత్యంత విషాదం తనను ముట్టిన సమయంలో షూటింగ్‌లో పాల్గొన్నా. మా నాన్నగారు చనిపోయిన నాలుగురోజుల తర్వాతే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. నా బాధంతా ఇందులో కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రతి రోజూ నాకో సవాలువంటిది. నా ఆత్మలో కొంతభాగం ఇందులోకి వెళ్లిపోయింది. ఇంటికెళ్లిన ప్రతిరోజూ ఈ సినిమా చేయగలనో లేదోనంటూ అమ్మ దగ్గర ఏడ్చేదాన్ని. అయితే మరుసటి రోజు మాత్రం ఎప్పటిమాదిరిగానే షూటింగ్‌కు వెళ్లిపోయేదాన్ని’ అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. మేరీకోమ్‌ను తలపించేరీతిలో మారేందుకుగాను ప్రియాంకచోప్రా ప్రతిరోజూ ఎంతో శ్రమించేది.
వాకింగ్, రన్నింగ్, బాక్సింగ్ వంటి వాటిని సాధన చేసేది. ఒముంగ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఈ సినిమా నాకు అత్యంత ప్రత్యేకమైనది. వైఫల్యాలను ఎదుర్కోవడానికి ఇష్టపడను. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడదని ఆశిస్తున్నా. ఈ సినిమా ఇతివృత్తం నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించింది. ఈ సినిమా బాగా ఆడుతుందని ఆశిస్తున్నా’అని తెలిపింది. కాగా ఈ సినిమాపై దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రియాంక ప్రచారం చేస్తోంది. టొరంటోలో జరగనున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఈ నెల నాలుగో తేదీన హాజరు కానుంది. కాగా మేరీ కోమ్ సినిమా ఈ నెల ఐదో తేదీన విడుదల కానుంది.