ప్రియాంకా, మోదీతో అలాగేనా!
జర్మనీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ పర్యటనలో ఉన్న ‘బేవాచ్ స్టార్’, బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా కలుసుకొని ఫొటో దిగిన తీరుపై సోషల్ మీడియా దుమ్మెత్తి పోసింది. మోకాళ్ల పైవరకు కనిపించేలా పొట్టి గౌను ధరించి మోదీ పక్కన కూర్చొని ఫొటో దిగడం పట్ల వారంతా అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘ప్రియాంక! మీరు మన దేశ ప్రధాన మంత్రితో కలసి కూర్చున్నారు. మోకాళ్లు కనిపించకుండా దాచుకోవాలన్న కనీస జ్ఞానం కూడా లేకపోతే ఎలా?.. నీవు పెద్ద అంతర్జాతీయ తారవైతే కావచ్చు. ప్రధాని పట్ల కాస్త గౌరవంగా నడుచుకోవాలిగదా, ఒకసారి ఆయన పక్కన నీవు ఎలా కూర్చున్నావో చూసుకో.. ఆమెకు పెద్దలను ఎలా గౌరవించాలో తెలియదనుకుంటా. దేశ సంస్కృతిని కూడా ఆమె మరచిపోయినట్లున్నారు.. ఓ సెలబ్రిటీ, వాళ్ల ప్రధానమంత్రిని ఎలా గౌరవిస్తుందో చూడండి. మోడ్రన్‌గా ఉందామని ఆశిస్తున్న ఆధునిక మహిళా ప్రపంచం పట్ల నాకు జాలేస్తోంది.. ఆధునిక దుస్తులు వేసుకొని పాశ్చాత్య సంస్కృతిని అనుసరించాలనుకుంటే తప్పులేదు. మనకంటూ ఓ సంస్కృతి, సంప్రదాయం ఉన్నాయి. ఎలాంటి సందర్భాల్లోనూ దాన్ని విస్మరించవద్దు.. ఆయనేమీ నీ బాయ్ ఫ్రెండ్ కాదు, మన ప్రధాన మంత్రి, అందులోనూ అత్యంత శక్తిమంతమైన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి ముందు కాలి మీద కాలేసుకుని ఇంకెప్పుడూ కూర్చోకండి...’ అంటూ పండితుల నుంచి పామరుల దాకా, జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రియాంక చోప్రాను సమర్థిస్తూ కూడా సోషల్ మీడియాలో దేశీయంగా వ్యాఖ్యలు వచ్చాయి. ‘ప్రియాంకను, ఆమె దుస్తులను విమర్శించేవారికి నేను చెప్పేది ఒకటే, ఇది ఇస్లామిక్ దేశం కాదు, భారత దేశం. ప్రతి మహిళకు తనకిష్టమైన దుస్తులు ధరించే హక్కు ఉంది. ప్రియాంక దుస్తులపై దృష్టి పెట్టేకంటే మీ పనులు మీరు చూసుకుంటే మంచిది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. బెర్లిన్ నగంరలో మంగళవారం మోదీని కలసుకున్న ప్రియాంక చోప్రా, ఆ సందర్భంగా దిగిన రెండు ఫొటోలను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఎంతో బిజీగా ఉన్న ప్రధాని మోదీ తనను కలసుకోవడానికి సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కూడా చెప్పారు.