
రాహుల్ కన్నా ప్రియాంకే బెటర్
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించాలని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 19వ తేదీకన్నా ముందే ప్రియాంకగాంధీ పేరును ఖరారు చేసి ప్రకటించాలని వారు కోరుతున్నారు. తొలుత రాహుల్ గాంధీ గానీ, ప్రియాంక గాంధీ గానీ పోటీ చేయాలని పట్టుబట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు ప్రియాంకనే కోరుకుంటున్నారన్నది తాజా ప్రశ్న.
గతంలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రచార సారథ్యాన్ని స్వీకరించిన రాహుల్ గాంధీ పార్టీని విజయపథాన నడిపించలేక పోయారని, ఆయన పేరు వెంట ఓటమి వెన్నంటే వస్తోందని స్థానిక పార్టీ నాయకులు భావిస్తున్నారు. రాహుల్ కన్నా ప్రియాంక పట్లనే ప్రజల్లో ఎక్కువ అభిమానం ఉంటుందని, ఆమె ప్రచారం కారణంగా ఓడిపోయిన వారు లేరని వారంటున్నారు. పైగా సోనియా గాంధీ వారసుడిగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిన రాహుల్ గాంధీని రాష్ట్ర రాజకీయాల స్థాయికి దిగజార్చలేమని కూడా వారంటున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయవచ్చని, తద్వారా దేశవ్యాప్తంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కోవచ్చని పార్టీ అధిష్ఠానానికి నచ్చజెప్పేందుకు రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది.
రాష్ట్రంలో అగ్రవర్ణాల వారు, ముఖ్యంగా బ్రాహ్మణులు ఎక్కువ ఉండటం ప్రియాంక గాంధీకి కలిసొచ్చే అంశం అని స్థానిక కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని బ్రాహ్మణుల్లో 31 శాతం మంది కాంగ్రెస్ పార్టీకే ఓటేశారని 'సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్' లెక్కలు తేల్చాయి. ఒక్క సామాజిక గ్రూప్ నుంచి ఇంత మంది కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి. 31 శాతం బ్రాహ్మణుల ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి 21 లోక్‌సభ స్థానాలను గెలుచుకొంది. 2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 19 శాతం మంది బ్రాహ్మణులు ఓటేశారు.
రాష్ట్రం మొత్తం జనాభాలో 20 శాతం మంది అగ్రవర్ణాల వారు ఉన్నారు. వారిలో 9 శాతం మంది బ్రాహ్మణులు. ఈసారి ప్రియాంక గాంధీని బరిలోకి దించితే వారంతా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని రాష్ట్ర పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసే అగ్రవర్ణాల వారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీ సంక్షేమ నినాదం ఎత్తుకోవడం పట్ల ఆగ్రహంతో ఉన్నారని, ఓబీసీకి చెందిన కేశవ్ ప్రసాద్ మౌర్యాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని చేయడం కూడా వారికి మింగుడు పడడం లేదని కాంగ్రెస్ పార్టీ వారు భావిస్తున్నారు.