
ప్రియాంకకు పార్టీ పగ్గాలు.. ఉత్తదే!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రియాంక గాంధీని నియమించబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె కార్యాలయం స్పందించింది. ఆ ప్రచారంలో వాస్తవం లేదని ఓ ప్రకటనలో తెలియజేసింది.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అలాంటి చర్చేం ప్రస్తావనకు రాలేదు. అదంతా ఉత్త ప్రచారమే అని ఆమె వ్యక్తిగత సిబ్బంది పి సహాయ్ వెల్లడించారు. ఈ ఉదయం నుంచి కాబోయే కాంగ్రెస్ చీఫ్ ప్రియాంక అంటూ కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే.
అయితే పార్టీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఆగష్టు 8న జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో ఈ మేరకు ఓ ప్రతిపాదన మాత్రం వచ్చినట్లు తెలుస్తోంది. నాయకత్వం మార్పు అంశాన్ని అధ్యక్షురాలు సోనియా లెవనెత్తగా, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రియాంక గాంధీ పేరును సూచించినట్లు భోగట్టా. పడిపోతున్న పార్టీని తిరిగి నిలబెట్టాలంటే యువ రక్తం రావాల్సిన అవసరం ఉందంటూ పలువురు సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.