
రంగంలోకి ప్రియాంక తప్పనిసరి!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించనున్న రాష్ట్రాల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తనయ ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించనున్నారు. ముఖ్యంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం లో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. ఇదివరకే యూపీ ఎన్నికలలో ప్రియాంక చేతికి ప్రచార పగ్గాలు ఇవ్వనున్నారని కథనాలు వచ్చాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక ప్రచారబరిలో దిగితే పార్టీ నేతల్లోనూ నూతనోత్సాహం వెల్లువెత్తుతుందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం అమరిందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రియాంక అయితే సమర్దవంతంగా పార్టీ కేడర్ ను నడిపిస్తారని అమరిందర్ అన్నారు. దీంతో పంజాబ్ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
మరోవైపు బీజేపీకి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ తో త్వరలోనే భేటీ కానున్నట్లు తెలిపారు. ఇప్పటికే సిద్ధూ భార్య పర్గత్ సింగ్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సిద్ధూ కొన్నిరోజుల కిందటే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి పలు విషయాలపై చర్చించారని గుర్తుచేశారు. వన్ ఫ్యామిలీ-వన్ టికెట్(కుటుంబానికి ఒకే టికెట్) విషయాన్ని ప్రస్తావించిన పార్టీ చీఫ్.. మాజీ క్రికెటర్ తమ పార్టీలో చేరినా సిద్ధూ దంపతులలో ఒకరికి మాత్రమే సీటు కేటాయిస్తామని కెప్టెన్ అమరిందర్ సింగ్ స్పష్టం చేశారు. ఇటీవల 61 స్థానాలకు పార్టీ టికెట్లు కేటాయించిన విషయం తెలిసిందే. రెండో జాబితాపై పార్టీలోనే ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి.