న్యూఢిల్లీ: రామ్ లీలా మైదానంలో కిక్కిరిసిన అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రిగా మనీష్ సిసోడియా, మంత్రులుగా అసిమ్ అహ్మద్ , సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, సందీప్ కుమార్, జితేంద్ర తోమర్ ప్రమాణం స్వీకారం చేశారు.లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ వీరితో ప్రమాణం చేయించారు. అనంతరం కేజ్రీవాల్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తాను, తన మంత్రివర్గం 24 గంటలూ కష్టపడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. తన గొంతు బాగా లేదంటూనే... ఇన్ సాన్ కా ఇన్ సాన్ హై... మన్నాడే పాడిన పాటను కేజ్రీవాల్ పాడుతుంటే అభిమానులంతా ఆయనతోపాటు గొంతుకలిపారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ సీఎం కేజ్రీవాల్ తన ప్రసంగాన్ని ముగించారు.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
* ఢిల్లీ ప్రజలకు మా మీద ప్రేమ ఉందని తెలుసు, కానీ మమ్మల్నిఇంత గొప్పగా ఆదరిస్తారని అనుకోలేదు.
* మాకు ఓటు వేశారా లేదా అనే దాంతో ప్రమేయం లేకుండా .. మా ప్రభుత్వం అందరిదీ. నేను ఒక్కడినే కాదు ఢిల్లీలోని ప్రతి పౌరుడూ ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినట్టే.
* ఢిల్లీ శాంతికాముక నగరం. మతపరంగా ఢిల్లీని విభజించాలనుకుంటే సహించం.దీపావళి, క్రిస్టమస్, ఈద్ సమానంగా జరుపుకుందాం.
* అతి త్వరలోనే జనలోక్ పాల్ బిల్లును తీసుకొస్తాం.
* భారతదేశంలో మొట్టమొదటి అవినీతి రహిత నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దుతాం
* ఆసుపత్రులు, రోడ్లు నిర్మిస్తాం. మహిళలకు భద్రత ఉండేలా ఢిల్లీని తయారుచేస్తాం.
* మీరు పన్నులు చెల్లించండి..మేం వాటిని మంచి పనులకు ఉపయోగిస్తాం.
* ఇండియా ప్రపంచ కప్ గెలుచుకోవాలి. టీమిండియా సభ్యులకు మా అభినందనలు
* కిరణబేడీ నా సహోదరి లాంటివారు. అజయ్ మాకెన్ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నేత. వారిద్దరి సూచనలు, సలహాలు తప్పక స్వీకరిస్తాం.
* రెడ్ కార్పెట్, వీఐపీ సంస్కృతులను మారుస్తాం. చాలా దేశాల్లో ప్రధానమంత్రులు బస్ స్టాప్ లలో వేచి ఉంటారు.