సామాన్యుడి సక్సెస్ వెనుక...
- ఆప్ విజయం ఒక్కరిది కాదు
- తెరవెనుక కృషి చేసిన వారెందరో..
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో 432 మంది అభ్యర్థులను నిలబెడితే 413 మంది డిపాజిట్లను పోగొట్టుకున్న పార్టీ... కేవలం 2.07 శాతం ఓట్లే సాధించిన పార్టీ.. నాలుగంటే నాలుగే ఎంపీ సీట్లు గెలుచుకున్న పార్టీ.. తన ప్రాథమిక రణక్షేత్రమైన ఢిల్లీలో సున్నా అయిన ఆమ్ ఆద్మీ పార్టీ.. తిరిగి కోలుకుంటుందని కనీసం ఎవరైనా ఊహించనైనా లేదు.. అప్రతిహత విజయ పరంపరతో మాంఛి ఊపు మీద ఉన్న నరేంద్రమోదీ గొంతు వింటే చాలు.. ఢిల్లీ ప్రజలు పొలోమని పరుగులు పెట్టి కమలంపై మీట నొక్కేస్తారన్న బీజేపీ ధీమా నీరు గారుతుందని ఎవరైనా ఊహించారా? మోదీ గెలుపు బాటలో కేజ్రీవాల్ స్పీడ్ బ్రేకర్‌గా మారతారని ఎవరి కైనా తట్టిందా? కానీ, ఢిల్లీలో అక్షరాలా జరిగింది అదే.
అట్టడుగుకు పడిపోయారనుకున్న కేజ్రీవాల్ ఊహించని వేగంతో సునామీ తరంగంలాఎగసి వచ్చారు. దాని ధాటికి మోదీతో సహా సమస్త పార్టీలు ఎక్కడికి పోయా యో తెలియనంతగా కొట్టుకుపోయాయి. ఇదంతా కేవలం కేజ్రీవాల్ ఒక్కడి వల్లో.. లేక ఆయనతో పాటు పార్టీతరపున చానళ్లలో రోజూ కనపడే నాయకుల వల్లనో జరిగింది కాదు. ఈ విజయంవెనుక తెరముందుకు రాని ముఖాలు, ఎవరికీ వినిపించని పేర్లు ఉన్నాయి. నిరాశా, నిస్పృహల్లో ఉన్న పార్టీకి జవసత్వాలు అందించింది ఈ తెరవెనుక బృందమే.
సోషల్ మీడియా టీం: ఈ బృందానికి నాయకత్వం వహించింది అభినవ్. ఇతని పేరు ఫేస్‌బుక్ వాడే వాళ్లలో చాలామందికి పరిచయమే. ఇతని బృందమే.. సోషల్ నెట్‌వర్క్‌ను అత్యంత బలంగా వాడే మోదీ అండ్‌కోను అధిగమించి ప్రజల్లోకి పార్టీని తీసుకుపోగలిగింది. మధ్యతరగతి సహా అన్ని వర్గాల్లోకి పార్టీ తీసుకుపోవటంలో అభినవ్ బృందం రేయింబవళ్లు శ్రమించింది.
కాల్ క్యాంపెయిన్: అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తరువాత ఢిల్లీ ప్రజల్లో పార్టీ పట్ల ఏర్పడిన భ్రమలను తొలగించటం కోసం ఆమ్ ఆద్మీపార్టీ కాల్‌క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఫోన్‌లో ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులు చెప్పటం.. వారిలో అయోమయాన్ని తొలగించి.. తిరిగి పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంచటంలో ఈ రకమైన ప్రచారం ఆప్‌కు బాగా దోహదపడింది. 22ఏళ్ల ఫార్మసిస్ట్ మహజ్, అతని స్నేహితులు గౌతమ్, ఆకాశ్‌లు ఈ బృందానికి నేతృత్వం వహించారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఆందోళనల్లోనూ ఈ టీమ్ చురుకైన పాత్ర పోషించింది.
మీడియా మేనేజ్‌మెంట్: దేశ ప్రజల్లో ఎంతమంది గమనించారో లేదో కానీ, గత కొన్ని నెలలుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వార్త టెలివిజన్‌లో రాకుండా రోజు గడిచిపోయిన దాఖలా లేదు. విలేకరుల సమావేశం కానీ, ప్రెస్‌నోట్ కానీ, ఢిల్లీ రాజకీయాలపై ఆప్ కేంద్రంగా విశ్లేషణలు కానీ లేని రోజు లేదు. మీడియా ముందు కీలక మైన అంశాలను లేవనెత్తడం, తమ రాజకీయపు ఎత్తుగడలపై చర్చించుకునే లా చేయటంలో ఆప్ సూపర్ సక్సెస్ అయింది. ప్రముఖ పాత్రికేయులు నాగేంద్ర శర్మ అతని సహచరులు దీపక్ వాజపేయి, వందనా, మితాలీ నేహా, వికాస్ యోగి వంటి వాళ్ల బృందం దీన్ని పర్యవేక్షించింది. పార్టీ నేతలు, మీడియాకు మధ్య ఒక బలమైన సమన్వయం కుదిరేలా వీళ్లు కృషి చేశారు. వీరికి పార్టీ అధికార ప్రతినిధి ఆతీషి మౌలానా మార్గదర్శకత్వం వహించారు.
వార్ రూమ్: పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను, వ్యూహ ప్రతివ్యూహాలను రచించి అమలు పరచిన టీం. ప్రత్యర్థుల ఎత్తుగడలను విశ్లేషించి కార్యాచరణను నిర్ణయించటంలో ఈ బృందం కీలక భూమికను నిర్వహించింది. ఆశిశ్ తల్వార్, రాజేశ్ తల్వార్, దిలీప్ పాండే, దుర్గేశ్, ఆశుతోశ్, ఆతిశీ, స్వాతి, వందనలు ఈ థింక్‌టాంక్‌లో భాగస్వాములు.
డేటా మేనేజ్‌మెంట్: పార్టీపై రకరకాలుగా వచ్చే ఆరోపణలు.. స్పందనలు, విశ్లేషణలు, తదితర సమాచారాన్ని అంతా భద్రపరచటంకోసం ఆప్ ఏకంగా ఓ డేటామేనేజిమెంట్ వ్యవస్థను నెలకొల్పింది. అవసరమైన మేరకు దీన్ని వినియోగించుకునేలా ఏర్పాటు చేసింది. ఆశిష్ తల్వార్, దుర్గేశ్ పాఠక్‌లుదీన్ని పర్యవేక్షించారు.
ఫండింగ్ మేనేజిమెంట్: పార్టీకి వచ్చే విరాళాలు పార్టీ ప్రధాన కార్యదర్శి పంకజ్ గుప్తా పర్యవేక్షణలో జరిగాయి. విరాళలను పరిశీలించి అవినీతికి ఆస్కారం లేకుండా తీసుకునే ప్రయత్నం పంకజ్ చేశారు.
ప్రచార నిర్వహణ
ఎన్నికల్లో అత్యంత కీలకమైంది ఎన్నికల ప్రచారం. ఆప్‌కు సంబంధించిన మొత్తం 70 మంది అభ్యర్థుల ప్రచారాన్ని ఒకే బృందం కేంద్రంగా పర్యవేక్షించింది. ఏ నియోజక వర్గానికి ఏ నాయకుడు వెళ్లి ప్రచారం చేయాలి? ఏయే అంశాలు ప్రస్తావించాలి? అన్న వాటిని జాగ్రత్తగా నిర్ణయించి అమలు చేసే బాధ్యతను ఆశిష్ తల్వార్ చేపట్టారు. గత ఎన్నికల్లో వీధి వీధికీ చీపురుపట్టి ఊడ్చే ప్రచారానికి కూడా ఈయనే నేతృత్వం వహించారు. ఇక పార్టీ అధినేత ప్రచార వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించింది గోపాల్ మోహన్, మురళీధరన్, రోహిత్, రుచా పాండే మిశ్రాల బృందం. కేజ్రీవాల్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎవరితో ఫోన్లో మాట్లాడతారు? ఎవరిని ఎప్పుడు కలుస్తారు? ఎప్పుడు ఏం తింటారు అన్న అన్ని విషయాలనూ ఈ బృందమే పర్యవేక్షించింది. ఆయనకు మాట్లాడేందుకు తగిన సమాచారాన్ని కూడా ఈ బృందమే అందించింది.
బజ్ కాంపెయిన్
ఆప్‌ను ప్రజలకు చేరువ చేయటంలో ప్రభావవంతమైన పాత్ర పోషించింది ఈ బృందమే. ప్రజల్లో ఆప్‌కు అనుకూల వాతావరణాన్ని కల్పించటం కోసం రోడ్ల కూడళ్లలో యువతీయువకులు ప్లకార్డులు పట్టుకుని నిలుచోవ టం.. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఆప్ కార్యకర్తల ఫ్లాష్ మాబ్ ద్వారా తమ పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి పంపించ టం.. ఫుట్‌పాత్‌లపై ఆటపాటలు, రకరకాల వాయిద్యాలు వాయించటం వంటి వినోద కార్యక్రమాలకు నేతృత్వం వహిం చింది అదితీ రశ్మి, భాస్కర్, ఆనంద్, నందన్ మిశ్రా. వీరిలో నందన్ మిశ్రా ప్రదర్శనల్లో ప్రత్యక్షంగా పాల్గొంటే.. మిగతా వారు వాటి ఏర్పాట్లను పర్యవేక్షించారు.