రెండు హృదయాలు, మూడుముళ్లు, ఏడడుగులు.. నూరేళ్లపాటు భార్యాభర్తల బంధాన్ని కలిపి ఉంచుతాయి. నాతిచరామి అంటూ ప్రమాణం చేసింది మొదలు పెళ్లిపుస్తకంలోని చివరిపేజీ వరకు నమ్మక మే వివాహజీవితాన్ని నడిపిస్తుంది. అందుకే భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచ దేశాలకే ఆదర్శం అయింది. మారుతున్న కాలంలో ఈ కుటుంబ వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. కారణాలేవైనా చాలా ఇళ్లలో చీటికీమాటికీ గొడవలు ప్రశాంతతను చెదరగొడుతుంటాయి. చివరకు అది పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కేవరకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టం తెచ్చింది. ఇది అమలులో విఫలమవుతోంది. చట్టం దుర్వినియోగం కూడా అవుతోందనే విమర్శలున్నాయి. కొన్ని చిక్కులను కూడా తెచ్చిపెడుతోంది. భర్త వేధింపులకు పాల్పడితే అతడి కుటుంబ సభ్యులకూ పోలీసు కేసు తప్పడం లేదు. ఈ క్రమంలోనే మగాళ్లు మృగాళ్లుగా మారిన సంద ర్భాలు ఉన్నాయి. దీనిపై కథనం..
మానవ త్వం కోల్పోయి భార్యలను చిత్రహింసలకు గురిచేసే భర్తల నుంచి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కొన్నేళ్ల కిందట గృహ హింస నిరోధక చట్టాన్ని తీసుకువచ్చారు. భార్యలను చీటికీమాటికీ కొడుతూ వేధింపులకు గురిచేసే భర్తలకు చట్టం ద్వారా గుణపాఠం చెప్పాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. చట్టం వచ్చిన కొత్తలో మహిళలకు ఇది రక్షణ కవచంలా మారింది. రానురాను అనేకమంది మహిళలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో భార్యభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్ధలు వస్తే పెద్ద మనుషులు పంచాయతీ చేసి కాపురాలు కూలిపోకుండా కాపాడేవారు. అనంతరం పోలీస్‌శాఖ కుటుంబ కలహాలను పరిష్కరించేందుకు స్వచ్ఛంద సేవకుల ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
కొన్నాళ్లు బ్రహ్మాండంగా కొనసాగిన ఈ సెంటర్లు ఇప్పుడు ఒకటి రెండు సబ్‌డివిజన్లలో మినహా ఎక్కడా కనిపించడంలేదు. మనస్పర్ధలు, ఇతర గొడవలతో స్టేషన్‌లకు వచ్చే భార్యాభర్తలకు రెండుమూడు వారాల పాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించి అప్పటికీ వారి మధ్య సఖ్యత కుదరకపోతే అప్పుడు గృహహింస చట్టాన్ని అమలు చేయాల్సి ఉంది. అయితే కొందరు పోలీస్ అధికారులు ఇదేమీ పట్టించుకోవడం లేదు. భార్య ఆవేశంలో వచ్చి ఫిర్యాదు చేయగానే భర్త, అత్తమామలు, ఆడపడుచు, మరుదులపై ఫిర్యాదులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ మొత్తంలో డబ్బు గుంజుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేసు విషయంలో భర్తకు తప్ప మిగతావారికి సంబంధం లేదని తేలినప్పటికీ తమ జేబులు నింపితేనే కేసులో నుంచి మిమ్మల్ని తప్పిస్తామంటూ నేరుగా చెబుతున్నారు. చేసేది లేక వారు అడిగినంత సమర్పించుకుంటున్నారు. మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన గృహహింస చట్టం కొందరు పోలీస్ అధికారులకు ఆదాయ వనరుగా మారింది.
మృగాళ్లుగా మారి..
గృహహింస నిరోధక చట్టం ద్వారా అన్యాయంగా కేసుల్లో ఇరుక్కని అటు భార్యా పిల్లలకు.. ఇటు తల్లిదండ్రులు, అక్కా తమ్ముళ్ళకు దూరమై మానసికంగా దెబ్బతిన్న అనేకమంది దారుణాలకు తెగబడుతున్న వైనం నిత్యం చూస్తూనే ఉన్నాం. సంచలనం కలిగించిన పలు హత్యల ఉదంతాలను పరిశీలిస్తే ఇలాంటి నిజాలే బట్టబయలవుతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల ద్వారా కొన్ని కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య వచ్చే వివాదాలను సద్దుమణచాల్సింది పోయి కొందరు అధికారులు వారి స్వలాభం కోసం వాటిని పెంచి పెద్దవి చేస్తూ వారి కాపురంలో నిప్పులు పోస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కాపురాల్లో కార్చిచ్చు
Published Sun, Oct 12 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM
Advertisement
Advertisement