వారణాసి: లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రఖ్యాత బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)ను కుదిపేస్తున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థినిపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సహచర విద్యార్థినులు చేపట్టిన ఆందోళన.. శనివారం రాత్రి హింసాత్మకంగా మారింది. శనివారం రాత్రి క్యాంపస్ గేటు వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థినులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో కొందరు దుండగులు ప్రజా ఆస్తులను తగలబెట్టి.. రాళ్లు విసరడంతో రంగంలోకి దిగిన పోలీసులు, పారామిలిటరీ బలగాలు విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించారు.
ఆందోళన చేస్తున్న విద్యార్థినులను కనికరం లేకుండా చితకబాది.. అక్కడి నుంచి చెల్లాచెదురు చేశారు. బాలికల హాస్టల్‌లోకి ప్రవేశించి మరీ వారిని కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మీడియా ప్రతినిధులకూ గాయాలయ్యాయి. విద్యార్థినులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
యూనివర్సిటీలో విద్యార్థినులకు భద్రత లేకపోవడం, తరచూ లైంగిక వేధింపులు ఎదురవుతుండటంతో గత శుక్రవారం నుంచి విద్యార్థినులు ఆందోళనలు చేస్తున్నారు. క్యాంపస్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ శనివారం వారణాసి పర్యటనకు వచ్చినా.. విద్యార్థినులు తమ ఆందోళనను విరమించలేదు. ప్రధాని యూనివర్సిటీకి వస్తే ఆయన దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలని భావించారు. క్యాంపస్‌లో విద్యార్థినులకు భద్రత కల్పించాలని, లైంగిక వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని విద్యార్థినులు కోరుతున్నారు.