మోదీ సర్కారు విజయాలను చూపుతూ.. తమ పార్టీకే ఓటేయండంటూ శుక్రవారం జాతీయ పత్రికల్లో బీజేపీ ప్రకటనలు ఇవ్వడంపై ఆప్ మండిపడింది.
న్యూఢిల్లీ: మోదీ సర్కారు విజయాలను చూపుతూ.. తమ పార్టీకే ఓటేయండంటూ శుక్రవారం జాతీయ పత్రికల్లో బీజేపీ ప్రకటనలు ఇవ్వడంపై ఆప్ మండిపడింది. ప్రచారం ఇప్పటికే ముగిసినా.. ఇలా ప్రకటనలు ఇవ్వడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపించింది. అయితే దీన్ని ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఇది నియమావళి ఉల్లంఘన కిందకు రాదని స్పష్టంచేసింది. సరిగ్గా ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఢిల్లీలో పత్రికల మొదటి పేజీల నిండా బీజేపీ ప్రకటనలు ఇచ్చింది.
అందులో మోదీ సర్కారు విజయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ప్రచారం ఇప్పటికే ముగిసింది. అయినా ఇలా ప్రకటనలు ఇవ్వడం ఏంటి? ఎన్నికల ముంగిట ఈ ప్రకటనలు కచ్చితంగా ప్రజలను ప్రభావితం చేస్తాయి. టీవీల్లో ప్రకటనలు నిలిపివేసి.. పత్రికల్లో మాత్రం అనుమతించడంలో అర్థం లేదు. ఈ మేరకు చట్టాన్ని సవరించాలి. ఆ ప్రకటనలకు నిధులు ఎక్కడ్నుంచి వచ్చాయో బీజేపీ చెప్పాలి’’ అని ఆప్ నేత అశుతోష్ డిమాండ్ చేశారు.
అయితే ప్రజాప్రాతినిధ్యి చట్టంలోని సెక్షన్ 126 ప్రకారం ఈ ప్రకటన ఉల్లంఘన కిందకు రాదని ఈసీ తెలిపింది. ‘‘చట్టం ప్రకారం సినిమాటోగ్రఫీ, టెలివిజన్.. ఈ కోవకు చెందిన ఇతర సాధనాల మాత్రమే ప్రచారం చేయరాదు. సెక్షన్ 126లోని నిబంధన ప్రింట్ మీడియాకు వర్తించదు’’ అని ఈసీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టంచేశారు. కాగా, ఆప్‌కు చట్టం, నిబంధనలు ఏమీ తెలియవని బీజేపీ ఎద్దేవా చేసింది.
ఎన్నికలు జరిగే రోజు వరకు ఇలాంటి ప్రకటనలు ఇవ్వొచ్చని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు పేర్కొన్నారు. సెక్షన్ 126 పరిధిలోకి ప్రింట్ మీడియాను కూడా తీసుకువచ్చేందుకు యూపీఏ సర్కారు యత్నించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇది న్యాయశాఖ పరిధిలో ఉంది. ఆ శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రజాప్రాతినిథ్య చట్టంలో మార్పులు చేయాలా వద్దా అన్నది ప్రభుత్వం నిర్ణయించనుంది.