
చండీగఢ్ : దేశంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల వద్ద దిగబెట్టనున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఇందుకోసం మహిళలు 100, 112, 181 నెంబర్లకు ఫోన్ చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉండేలా చూడాలని డీజీపీ దిన్‌కర్ గుప్తాను సీఎం ఆదేశించారు.
మహిళలు చేరుకోవాల్సిన ప్రదేశానికి టాక్సీ గానీ, భద్రతతో కూడిన రవాణా సదుపాయం గానీ లేకపోతే పోలీసులు వారికి సాయం అందిచనున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చే సమయంలో ఒక మహిళ కానిస్టేబుల్ తోడుగా ఉండనున్నారు. ఇందుకోసం కేటాయించిన వాహనాలు రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలతో పాటు, ఇతర ముఖ్య నగరాల్లో అందుబాటులో ఉంఉనున్నాయి. జిల్లా స్థాయిలో డీఎస్పీ గానీ, ఏసీపీ గానీ ఈ పథకానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. కాగా, ఇటీవల హైదరాబాద్ నగర శివార్లలో వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.