సాక్షి, చండీఘర్ : అధికారానికి పదేళ్లు దూరంగా ఉన్న పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ పాలనాపగ్గాలు అందుకునేందుకు ఇచ్చిన హామీలు ఇప్పుడు సీఎం అమరీందర్ సింగ్‌ను చిక్కుల్లో పడేశాయి. రైతులకు రుణ మాఫీ, యువతకు ఉద్యోగాలు, స్మార్ట్ ఫోన్ల పంపిణీ వంటి పలు వరాలు గుప్పించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా వాటి అమలు దిశగా అడుగులు వేయలేదు. రుణమాఫీ కాకుండానే ఇతర హామీల అమలుకు రూ 10,000 వేల కోట్ల నిధులు అవసరమవుతుండగా, బ్యాంకులు, ఆర్థిక సంస్ధలకు రైతుల రుణ బకాయిలు రూ 90,000 కోట్లు పేరుకుపోయాయి. మొత్తంమీద ఎన్నికల హామీలను నెరవేర్చాలంటే అమరీందర్ సర్కార్‌కు రూ లక్ష కోట్ల నిధులు అందుబాటులో ఉండాలి. నిధుల కొరత వెంటాడుతుండటంతో ఈ హామీల అమలుకు పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు చేసేదేమీలేదు.
వ్యవసాయ రుణాల మాఫీని ప్రభుత్వం ఇటీవల ప్రకటించినా అది పలు పరిమితులతో అరకొరగా సాగుతోంది. రానున్న నాలుగేళ్లలో హామీలన్నీ నెరవేరుస్తామని సర్కార్ నమ్మబలుకుతోంది. మరోవైపు అమరీందర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పంజాబ్‌లో 360 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విపక్ష నేత సుఖ్పాల్ సింగ్ ఖైరా ఆరోపించారు. వ్యవసాయ రుణాల మాఫీతో పాటు ఇంటికో ఉద్యోగం, డ్రగ్స్ నిర్మూలన, అవినీతికి చరమగీతం, యువతకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ వంటి పలు హామీలను నెరవేర్చడం పాలక కాంగ్రెస్‌కు సవాల్‌లా మారింది. నిధుల కొరతతో ఇటీవల కొన్నినెలల పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలే చెల్లించలేని పరిస్థితి నెలకొంది. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నుంచి సరైన ఆర్థిక సహకారం లభించకపోవడం ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment