సాక్షి, ముంబై: వీఐపీల భద్రత కోసం కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ సూచనల ప్రకారం కీలకవ్యక్తుల భద్రత కోసం ఆరు కొత్త ‘బుల్లెట్‌ప్రూఫ్’ వాహనాలు కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు అంగీకరించింది. అయితే వీటి కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. టెండర్లు లేకుండా కొనుగోళ్లు జరపడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశాయి.
వీఐపీల కోసం ప్రస్తుతం ప్రభుత్వం దగ్గరున్న ఆరు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. అయినప్పటికీ అదనంగా ఆరు టొయోటా ఫార్చ్యూన్ మోడల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆదీనంలో 2009 తయారీ ఆరు టాటా సఫారీ మోడల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉన్నాయి. ఇందులో రెండు వాహనాలు ముఖ్యమంత్రి, ఉప-ముఖ్యమంత్రి వినియోగిస్తున్నారు. మిగతా నాలుగు వాహనాలను వీఐపీల కోసం రిజర్వు చేసి ఉంచారు.
ఇవన్ని పూర్తిగా రన్నింగ్ కండిషన్‌లోనే ఉన్నాయి. అయినప్పటి టెండర్లను ఆహ్వానించకుండా స్ట్రెయిట్ ఆర్మింగ్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ నుంచి ఈ ఆరు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రూ.2.75 కోట్లు చెల్లించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు సరఫరా చేయడంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మహీంద్రా వంటి అనేక ప్రముఖ కంపెనీలకు అపార అనుభవం ఉంది. 1992 జనవరి రెండు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ.50 వేలు, ఆపై విలువచేసే వస్తువుల కొనుగోలుకు బహిరంగ టెండర్లు ఆహ్వానించడం తప్పనిసరి చేశారు. టెండర్లను ఆహ్వానిస్తూ అన్ని దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది.
సాధారణ పరిపాలన విభాగం నియమాల ప్రకారం రూ.10 లక్షలకుపైగా విలువచేసే ఏ వస్తువులైన కొనాలంటే ఈ-టెండర్లను కచ్చితంగా ఆహ్వానించాలి. సంబంధిత కాంట్రాక్టర్ ప్రభుత్వానికి వాహనాలు అందజేసిన తరువాత వాటిని పరిశీలించిన తరువాతే మిగతా నగదు చెల్లించాలని నియమాలున్నాయి. ఇదిలా ఉంటే రెండు, మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల జరిగే సూచనలు ఉన్నాయి. దీంతో త్వరలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చే ప్రమాదం ఉంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం హడావుడిగా వాహనాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించిందని, అందుకే నియమాలను తుంగలో తొక్కిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆదరబాదరగా స్ట్రెయిట్ ఆర్మింగ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఒక్కో వాహనం ధర రూ.22 లక్షలు ఉంది. దీనిని బుల్లెట్‌ప్రూఫ్ వాహనంగా మార్చేందుకు అదనంగా రూ.36 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని హోంశాఖ వర్గాలు తెలిపాయి.
టెండర్లు లేకుండానే వాహనాల కొనుగోలు
Published Wed, Jul 16 2014 1:23 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement