న్యూఢిల్లీ: సంక్రాంతి కోడిపందాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోడిపందాలకు అనుమతి నిరాకరిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, కోడిపందాలు కోనసీమ సంప్రదాయమని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నెల 5 లేదా 6 తేదీల్లో దీనిపై విచారణ జరిగే అవకాశముంది.
కోడిపందాలకు బ్రేక్ వేస్తూ డిసెంబర్ 26న హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోడిపందాల పేరుతో జంతువులను హింసిస్తున్నారని పేర్కొంటూ.. పీపుల్ ఫర్ యనిమల్ ఆర్గనైజేషన్, యనిమల్ వెల్ఫేర్ బోర్డు వేసిన పిటిషన్ ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాలిచ్చింది. కోడి పందాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది.