
ఇంతకీ రాహుల్ గాంధీ ఎక్కడున్నారు?
అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ దేశాన్ని విడిచి ఎంచక్కగా జాలీగా విదేశాలకు వెళ్లాడని వస్తున్న ఆరోపణలకు సమాధానంగా ఆ పార్టీ కార్యకర్త జగదీశ్ శర్మ ఒక రాహుల్ ఫొటోను విడుదల చేశాడు. ఆయన దేశాన్ని విడిచి పోలేదని, భవిష్యత్లో పార్టీని ఎలా వృద్ధిలోకి తీసుకొచ్చుకోవాలనే విషయాన్ని బాగా మేధోమదనం చేస్తున్నారన్నారు.
తనకు అపఖ్యాతి వచ్చే విషయాన్ని రాహుల్ గాంధీ పెద్దగా పట్టించుకోవడంలేదని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపట్లే ఆయన అమితంగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఉన్నట్లు చెప్పారు. బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఉంటుందని, అందులో ఆయన పార్టీ అధినేతగా మారే అవకాశం ఉందని, ఈ విషయం ఇష్టం లేనివారు పార్టీని విడిచి వెళ్లవచ్చని కూడా చెప్పారు.
జగదీశ్ శర్మ విడుదల చేసిన ఫొటోలో వెనుక ఓ వ్యక్తి నిల్చుని ఉండగా అతడి ముందు రాహుల్ కూర్చొని ఉండి చేతిలో ల్యాండ్ ఫోన్తో కనిపిస్తున్నారు. కాగా, ఈ రాహుల్ గాంధీ ఫొటో 2008నాటిదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంటుంది. మరోవైపు రాహుల్ విదేశాల్లో ఉన్నట్లు మరికొందరు కాంగ్రెస్ నేతలు చెప్పటం విశేషం.