ఆర్బీఐని ఖూని చేశారు!
రిషికేశ్: నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని మోదీ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని, ప్రతిష్టాత్మక ఆర్బీఐని సైతం ఖూనీ చేశారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. నోట్లు రద్దు చేసినంత వేగంగా మిగతా నిర్ణయాలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉత్తరాఖండ్ వచ్చిన ఆయన రిషికేశ్‌లో బహిరంగ సభను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.
'ఇవ్వాళ ప్రజలు ఎక్కడికి వెళ్లినా ఒక ప్రశ్న ఎదురవుతోంది.. పేటీఎం ఉందా? అని! ఒకవేళ పేటీఎం లేదంటే, బయటికి వెళ్లిపొమ్మనే సమాధానం వినిపిస్తుంది. పేటీఎం లేదంటే బహిష్కరణా? ఇది ఏమేరకు సబబు?'అని రాహుల్ వాపోయారు. ఎంతో మంది పేదలకు అన్నం పెడుతోన్న చరఖా(రాట్నం) ముందు కూర్చొని ఫొటోలకు పోజులిచ్చే ప్రధాని మోదీ, కేవలం 50 మంది బడాబాబులకు మేలు చేసే విధంగా విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఆఫీసులులో త్రివర్ణపతాకం లేదు!
దేశ స్వాతంత్ర్యం కోసం, త్రివర్ణ పతాకం కోసం గాంధీజీ ఎనలేని త్యాగాలు చేశారు. ఇప్పుడేమో ఖాదీ క్యాలండర్ మీద ఆయన ఫొటోను తొలిగించి, మోదీ ఫొటోలు ముద్రించారు. కొన్ని చోట్ల రాంలీలా నాటకాల్లో రాముడి పాత్రధారికి మోదీ మాస్కులు వేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్‌ఎస్‌లపై కొన్ని నెలలపాటు రీసెర్చ్ చేశా. స్వాతంత్ర్యానంతరం 52ఏళ్ల పాటు నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కర్యాలయంలో త్రివర్ణ పతాకం లేనేలేదు. ఇదీ.. వాళ్ల దేశభక్తి!' అని రాహుల్ మండిపడ్డారు. కాగ్రెస్‌పార్టీ ఎన్నికల గుర్తైన 'హస్తం'కు అన్ని ధర్మాల్లోనూ సముచిత స్థానం ఉందని, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేయగలుగుతుందని రాహుల్ అన్నారు. (ఆర్బీఐకి ఘోర అవమానం!)