పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక తల్లి సోనియాను ఆప్యాయంగా ముద్దాడుతున్న రాహుల్.
న్యూఢిల్లీ: దాదాపు 132 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కొత్త రథసారథిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టారు. తల్లి సోనియా గాంధీ నుంచి శనివారం ఆయన ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించారు. తల్లితో పాటు సోదరి ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్, ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో.. కాంగ్రెస్ కార్యకర్తల సంబరాల మధ్య ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. రాహుల్‌కు కాంగ్రెస్ ఎన్నికల సంఘం అధ్యక్షుడు రామచంద్రన్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాహుల్ రాజకీయ ప్రత్యర్థి బీజేపీని ఎదుర్కొనే వ్యూహాల్ని, పార్టీ అధ్యక్షుడిగా తన భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీపై విరుచుకుపడుతూ.. బీజేపీ విద్వేషాన్ని, హింసను ప్రేరేపిస్తోందని... దేశాన్ని మోదీ మధ్యయుగాల నాటికి తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. ప్రజలందరితో సమానంగా బీజేపీని గౌరవిస్తామని.. ఆ పార్టీ నేతల్లా ద్వేష భావం ప్రదర్శించబోమని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలంతా తన కుటుంబమని.. బాధిత వర్గాల తరఫున పోరాడుతున్న కార్యకర్తలకు అండగా ఉంటానని హామీనిచ్చారు. ప్రసంగానికి ముందు తల్లి ఆశీర్వాదం తీసుకున్న రాహుల్ గాంధీ ఆమె నుదిటిపై ముద్దుపెట్టారు.
వారిది హింస.. మనది ప్రేమ
‘ఈ రోజు బీజేపీ నేతలు దేశమంతా హింస, విద్వేషాల్ని రగులుస్తున్నారు. వారిని కాంగ్రెస్ కార్యకర్తల బలగం, నేతలు మాత్రమే నిలువరించగలరు. వారు విడగొడుతున్నారు. మనం ఏకం చేస్తున్నాం. వారు అగ్గి రాజేస్తుంటే.. మనం ఆర్పేస్తున్నాం. ఇదే వారికి మనకు మధ్య ఉన్న తేడా’ అని బీజేపీని రాహుల్ తప్పుపట్టారు. ఒకసారి విద్వేషాన్ని రగిలిస్తే.. దానిని ఆర్పడం చాలా కష్టమని.. ఈ విషయాన్ని బీజేపీ నేతలు అర్థం చేసుకునేందుకే తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ‘బీజేపీ నేతలు కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను కోరుతున్నారు.
మనల్ని లేకుండా చేయాలని ఆశిస్తున్నారు’ అని అన్నారు. కాంగ్రెస్ ప్రతి ఒక్కరి కోసం పోరాడుతుందని.. ఒంటరిగా పోరాడలేని వారికి అండగా ఉంటుందని, ప్రజల ప్రజాస్వామిక స్వప్నాలు, వారి ఆశలు చెదిరిపోయేందుకు ఎప్పటికీ అనుమతించదని రాహుల్ అన్నారు. ‘వారు గొంతు నొక్కుతున్నారు. మేం బాధిత ప్రజల గొంతు వినిపించేందుకు ప్రయత్నిస్తున్నాం. వారు అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. మేం గౌరవించడంతో పాటు దీటుగా ఎదుర్కొంటున్నాం’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వ్యక్తిగత మెప్పు కోసం మోదీ పాకులాట
మోదీపై రాహుల్ విరుచుకుపడుతూ..ప్రధాని దేశ ప్రజల్ని మధ్య యుగాల నాటికి తీసుకెళ్తున్నారని దుయ్యబట్టారు. ‘తాము నమ్మిన విలువలు, తినే తిండి కోసం ఆ కాలంలో కొందరి దుశ్చర్యలకు ప్రజలు బలయ్యారు. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోంది. విద్వేషంతో కూడిన హింస ప్రపంచంలో మనల్ని సిగ్గు పడేలా చేస్తోంది’ అని పేర్కొన్నారు. నిపుణులు, అనుభవజ్ఞులు, తెలివైన వారు ఉన్నా.. వారిని పక్కనపెట్టి తాను గొప్పవాడినని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు.
దేశ ప్రజల మధ్య చర్చల సాధనం..
మతం, జాతి, వయసు ఇలా ఎలాంటి తారతమ్యం లేకుండా దేశ ప్రజల మధ్య చర్చలకు సాధనంగా కాంగ్రెస్ పార్టీ సాయపడాలని రాహుల్ అభిలషించారు. ‘వయో, ప్రాంతీయ భేదాలు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలంతా నా కుటుంబమే.. మీరంతా నా వారే’ అని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. దేశం లోని అతి పురాతనమైన కాంగ్రెస్ పార్టీని.. ‘అతి పురాతన, యువ’ పార్టీగా మార్చాలని దేశ యువతను కోరారు. ‘విద్వేష రాజకీయాలపై పోరాడి వాటిని ఓడిద్దాం’ అని పిలుపునిచ్చారు.
రాయ్‌బరేలీ నుంచి అమ్మనే
2019 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీచేస్తారన్న ఊహాగానాలకు ప్రియాంకా గాంధీ తెరదించారు. రాయ్ బరేలీ నుంచి మరోసారి తన తల్లి సోనియా గాంధీనే పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ ప్రమాణస్వీకారానికి హాజరైన ఆమె మీడియా ప్రశ్నకు జవాబుగా ఈ విషయాన్ని తెలిపారు.
విమర్శలే ధైర్యవంతుడ్ని చేశాయి: సోనియా
తన తనయుడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తూ.. ధైర్యం, సహనం, అంకితభావంతో పార్టీని రాహుల్ నడిపించగలరనే నమ్మకం తనకు ఉందని సోనియా పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి రాహుల్ దారుణమైన వ్యక్తిగత దాడులు ఎదుర్కొన్నాడని, అవే అతన్ని మరింత ధైర్యవంతుడ్ని చేశాయని చెప్పారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ను అభినందిస్తూ.. ‘కొత్త, యువ నాయకత్వంలో.. మన పార్టీలో నూతనోత్సాహం వస్తుందని, అవసరమైన మార్పులు జరుగుతాయని నమ్మకం ఉంది’ అని అన్నారు.
కాంగ్రెస్ ముందుగా తన ఇంటిని చక్కదిద్దుకుని ఆ తర్వాతే మతతత్వ శక్తుల్ని అడ్డుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడాలన్నారు. ‘ప్రాథమిక విలువలు, వాక్ స్వాతంత్య్రం, విభిన్న సంస్కృతిపై దాడుల్ని చూస్తున్నాం. భయోత్పాత వాతావరణం సృష్టించారు. వీటి మధ్య తనను తాను పరిశీలించుకుని.. ఆత్మవిమర్శతో కాంగ్రెస్ ముందుకు వెళ్లాలి. నమ్మిన విలువలపై మనం నిలబడకపోతే.. సామాన్య ప్రజల తరఫున ఈ పోరును కొనసాగించలేం’ అని అన్నారు. దేశం ఊహించని సవాళ్లను ఎదుర్కొంటోందని... అయితే కాంగ్రెస్ పార్టీ వాటికి భయపడదని చెప్పారు.
గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కొంటోందని సోనియా పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో ఓడిపోయింది. అయినా కార్యకర్తల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది’ అని చెప్పారు. ఈ సందర్భంగా తన గతాన్ని గుర్తు చేస్తూ.. ఉద్విగ్నతకు లోనయ్యారు. భర్త రాజీవ్, తల్లిలాంటి ఇందిరల మరణం తర్వాత ఎలా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.. కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తల మద్దతుతో కేంద్రంలోను, అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన విషయాల్ని ఆమె గుర్తు చేశారు.
ముంబైలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment