సాక్షి, న్యూఢిల్లీ : సైనికుల యూనిఫాంకు కేటాయించే నిధుల్లో కోత విధించడం పట్ల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మంగళారం బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియా అంటూ నినాదాలిచ్చే ప్రభుత్వం మన సైనికుల దుస్తులు, షూలను వారే కొనుగోలు చేసేలా చేస్తోందని ఎకనమిక్ టైమ్స్‌లో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. నిధుల్లో కేంద్రం కోత విధించడంతో భారత సైన్యం ఫ్యాక్టరీల నుంచి సైనికుల దుస్తుల సరఫరాలను గణనీయంగా తగ్గించిందని ఈ కథనం పేర్కొంది.
నిధుల కేటాయింపులో కేంద్రం విఫలమవడంతో సైనికులు ప్రస్తుతం తమ యూనిఫాం, ఇతర నిత్యావసరాలను స్ధానిక మార్కెట్లలో తమ సొంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆ కథనం వెల్లడించింది. దీనిపై ఇప్పటివరకూ కేంద్రం, భారత ఆర్మీ స్పందించలేదు. 2014లో నరేంద్ర మోదీ నేతృతంలో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరినప్పటి నుంచి మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే క్రమంగా మేకిన్ ఇండియా నిర్వీర్యమవుతోందని విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నక్రమంలో సైన్యం తాజా ఉత్తర్వులు కేంద్రానికి ఇబ్బందికరంగా పరిణమించాయి.
Comments
Please login to add a commentAdd a comment