
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగుల యూనియన్ దేశవ్యాప్తంగా 72 గంటల నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. ఏడవ వేతన కమిషన్ ప్రొవిజన్లు అమలు చేయకపోవడం, ఈ రవాణా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి ఈ దీక్ష చేపట్టనున్నట్టు రైల్వే ఉద్యోగుల యూనియన్ పేర్కొంది. ఈ మేరకు ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్(ఏఐఆర్‌ఎఫ్) ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్ నాయకులతో ఏఐఆర్‌ఎఫ్ ఇప్పటికే పలుమార్లు సమావేశమైందని, హోం మంత్రి, ఆర్థికమంత్రి, రైల్వే మంత్రి, రైల్వే సహాయ మంత్రులు మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.
ఏడవ వేతన సంఘ సిఫారసులు అమల్లోకి వచ్చాక కనీస వేతనం మెరుగు పరచాలని, ఫిట్‌మెంట్ ఫాక్టర్ విషయంపైనా, పెన్షన్ విషయంలోనూ పలుమార్లు ప్రభుత్వానికి విన్నపించుకున్నామని ఏఐఆర్‌ఎఫ్ తెలిపింది. రెండేళ్ల సమయం వృద్ధా అయిన ఇప్పటివరకు వీటిపై ఎలాంటి ప్రకటన వెలువడ చేయలేదని ఏఐఆర్‌ఎఫ్ తెలిపింది. దీంతో ఏఐఆర్‌ఎఫ్‌తో అనుసంధానమైన అన్ని బ్రాంచులు మే 8 నుంచి మూడు రోజుల పాటు వరుసగా నిరాహార దీక్ష చేయున్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేలో ఈ దీక్షలు చేపట్టనున్నామని చెప్పింది. మే 13-14 తేదీల్లో ఏఐఆర్‌ఎఫ్, జనరల్ కౌన్సిల్, వర్కింగ్ కమిటీతో మీటింగ్ నిర్వహించనుంది.