
సాక్షి, న్యూఢిల్లీ : యూపీలోని రాయ్‌బరేలి మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవనున్న అత్యాధునిక స్మార్ట్ కోచ్‌లను భారతీయ రైల్వే త్వరలో ప్రవేశపెట్టనుంది. నూతన స్మార్ట్ కోచ్‌లు బ్లాక్ బాక్సులు, కోచ్ సమాచారం, డయాగ్నస్టిక్ వ్యవస్థలు కలిగిఉంటాయి. కోచ్ పరిస్థితిని నివేదించే అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ, రియల్‌టైమ్‌లో ప్రయాణీకుల సమాచారం చేరవేత వంటి ఫీచర్లను బ్లాక్ బాక్సుల్లో పొందుపరిచారు. కోచ్ డయాగ్నస్టిక్ వ్యవస్థలపై స్మార్ట్ కోచ్‌లు పనిచేస్తాయి.
ట్రాక్‌లు ప్రయాణానికి అనువుగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని వైబ్రేషన్ ఆధారిత సెన్సర్లు కలిగిన స్మార్ట్ కోచ్‌ల చక్రాలు ఇట్టే పసిగడతాయి. రైలులో ఉండే జెర్క్స్ ద్వారా సెన్సర్లు చార్జ్ అవుతాయి. ఒకే విండో ద్వారా అన్ని సెన్సర్లను సెంట్రలైజ్డ్ కంప్యూటర్ ద్వారా పర్యవేక్షిస్తారని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం జీఎస్‌ఎం నెట్‌వర్క్‌తో అనుసంధానించే ఇండస్ర్టియల్ గ్రేడ్ కంప్యూటర్ సేవలు అందించనుంది. ప్యాసింజర్ ఇన్‌ఫర్‌మేషన్ వ్యవస్థ రైలు ప్రస్తుత లొకేషన్, తదుపరి స్టేషన్ వివరాలు సహా స్టేషన్‌కు ఎంతసేపటిలో చేరుకోగలదనే విషయాలను వెల్లడిస్తుంది.
రైలు వేగాన్ని కూడా ఈ వ్యవస్ధ చూపుతుంది. కృత్రిమ మేథ సామర్థ్యాలతో కూడిన సీసీటీవీ ప్రయాణీకుల భద్రతను పెంచడమే కాకుండా రైళ్లలో రైల్వే సిబ్బంది ప్రవర్తన, కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మకంగా 100కు పైగా స్మార్ట్ కోచ్‌లను ప్రవేశపెట్టేందుకు రైల్వేలు యోచిస్తున్నాయని రైల్వే బోర్డ్ చైర్మన్ అశ్వని లోహాని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment