ఖర్చుల తగ్గింపుపై రైల్వే దృష్టి
న్యూఢిల్లీ: కేంద్ర సాయం తగ్గడం, ఆదాయం పడిపోవడంతో ఈ సారి బడ్జెట్‌లో రైల్వే శాఖ నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఆర్థిక అవసరాల సర్దుబాటుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు నేపథ్యంలో ఖజానాపై రైల్వే శాఖ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. నిర్వహణ ఖర్చుల్ని 15 శాతం తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నిర్వహణ ఖర్చులకు రూ.1.62 లక్షల కోట్లు వెచ్చిస్తున్నారు. సిబ్బంది క్రమబద్దీకరణ, ఉద్యోగులు మరింత శ్రమించేలా చూడడం, ప్రోత్సాహకాలు తగ్గించడం వంటి చర్యలపై సురేష్ ప్రభు దృష్టిపెడుతున్నారు. ప్రకటనలు, పార్సిల్ లీజు, రైల్వే పరికరాల ఎగుమతుల ద్వారా కొంత ఆదాయం సమకూరుతాయని ఆయన భావిస్తున్నారు. ఫిబ్రవరి 25న రైల్వే మంత్రి తన రెండో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వనరుల్ని పెంచుకునేందుకు సొంతంగా రైల్వే శాఖ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే చెప్పారు.
సర్వేలో ప్రయాణికుల సూచనలు
తత్కాల్ రద్దు చేసుకుంటే 50 శాతం ఛార్జీలు తిరిగివ్వాలని, బుకింగ్స్‌పై పరిమితి తొలగించాలంటూ సర్వేలో ప్రయాణికులు రైల్వేకు సూచనలు చే శారు. టీటీఈల లంచాలపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేయగా, అత్యవసర కేటాయింపులు దుర్వినియోగం అవుతున్నాయని తెలిపారు. ఈ బడ్జెట్‌లో అనేక కొత్త నిర్ణయాలు తీసుకొనున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు పెంచడంతో పాటు రైల్వేను వారికి మరింత చేరువ చేసే చర్యల్ని పొందుపరచనున్నారు.