
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా తనకు అండర్ వరల్డ్ వ్యక్తులతో ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవని పేర్కొన్నారు. బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు ఆయన హాజరయ్యారు. దాదాపు తొమ్మిది గంటల పాటు రంజిత్ బింద్రా, బాస్టియన్ హాస్పిటాలిటీ సంస్థలతో కుంద్రాకు గల సంబంధాలు, వడ్డీలేని రుణాలు అందించిన విషయంపై ఈడీ దర్యాప్తు చేసింది. ఈడీ విచారణ అనంతరం రాజ్ కుంద్రా స్పందిస్తూ.. ‘నాకు అండర్ వరల్డ్ వ్యక్తులు తెలియదు. అటువంటి వ్యక్తులతో వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు లేవు. 2011లో ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న నా ఇంటి స్థలాన్ని ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్ డైరెక్టర్ దీరజ్ వాధవన్ అమ్మడానికి చర్చలు జరిపాను. ఆ సమయంలో ఆయనతో నా ఇంటి స్థలం అమ్మకానికి సంబంధించిన చెల్లింపుల గురించి మాత్రమే చర్చించాను.
కాగా 2013లో నా కంపెనీ ఎసెన్షియల్ హాస్పిటాలిటీ స్థలాన్ని పూర్తి చెల్లింపులు జరగకముందే ఆర్‌కేరబ్ల్యూ డెవలపర్స్‌కి బదిలీ చేశాను. ఈ స్థలాన్ని ఆర్‌కేడబ్ల్యూకు అమ్మే సమయంలో నేను ఎటువంటి రుణాలు తీసుకులేదు. 2019లో ఎఫ్ అండ్ బీ సెక్టార్‌లో నేను పెట్టుబడులు పెడుదామని ఆసక్తిగా ఉన్నాను. ఈ విషయాన్ని తెలుసుకున్న రంజిత్ బింద్రా తన బాస్టియన్ రెస్టారెంట్‌లో పెట్టుబడులు పెట్టాలని నన్ను ఆశ్రయించారు. రెస్టారెంట్ యాజమాన్య నిబంధనల ప్రకారం నేను ఈ రెస్టారెంట్‌లో 50 శాతం షేర్‌కు సరిపడ పెట్టుబడులు పెట్టాను’ అని వెల్లడించారు. కాగా, గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్ మిర్చికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ రాజ్‌కుంద్రాకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.