సాక్షి, ముంబై : కేరళ లవ్ జిహాద్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సమయంలో.. అలాంటి ఉదంతాలు బోలెడు నమోదు అవుతున్నాయంటూ దర్యాప్తు సంస్థలు నివేదికలు వెల్లడించిన విషయం విదితమే. ఇదిలా ఉండగా రాజస్థాన్‌లో ఇప్పుడు మరో కేసు తెరపైకి వచ్చింది. పాయల్ సింఘ్వీ అనే 22 ఏళ్ల హిందూ యువతి రాజస్థాన్ హైకోర్టులో శనివారం బుర్ఖాతో ప్రత్యక్షమైంది. ముస్లిం యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్న ఆమె కోర్టు ప్రాంగణంలో తానోక ముస్లింనని ప్రకటించటం కలకలమే రేపింది.
యువతి తల్లిదండ్రులు ఆమెను బెదిరించి బలవంతంగా మతం మార్పించి మరీ యువకుడు వివాహం చేసుకున్నాడని వారు ఆరోపిస్తుండగా.. తన ఇష్టప్రకారమే అంతా జరిగిందని యువతి చెబుతోంది. ఇక ఈ ఘటనపై మహిళా సంఘాలు స్పందిస్తున్నాయి. తమకు తెలీకుండా తమ కూతురు మతం మారటం ఆ తల్లిదండ్రులు భరించలేకపోతున్నారని అబ సింగ్ అనే ఉద్యమకారిణి చెబుతున్నారు. ‘‘ఉగ్ర సంస్థలు ఆ యువతిని బలవంతం చేసి ఈ పని చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ కూతురు వెనక్కి రావొచ్చనే వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం బలవంతపు మత మార్పిడులపై రాజస్థాన్ ప్రభుత్వం చేసిన కఠిన చట్టాలే. అందుకుగానూ ఐదేళ్ల వరకు అక్కడ కఠిన కారాగార శిక్షలు ఉంటాయి. ఈ దశలో విచారణలోనే వాస్తవాలు తెలుస్తాయి’’ అని అబ సింగ్ చెప్పారు.
బలవంతపు మత మార్పిడులు చెల్లవని మరో ఉద్యమకారిణి షాలిని చౌచాన్ అంటున్నారు. ప్రతీరోజు తన తండ్రి పక్కన కూర్చుని సాయి బాబాని కొలిచే యువతి.. ఇలా చేసిందంటే నమ్ముతామా? తల్లిదండ్రులు అంతగా ఏడుస్తున్నా ఆమె పట్టించుకోలేదంటేనే పరిస్థితి అర్థమౌతోంది. ఆమె ఆలోచనలను ఎవరో బాగా ప్రభావితం చేశారు అని షాలిని చెబుతున్నారు.
గత నెల 25న ఇంటి నుంచి వెళ్లిన పాయల్ తిరిగి రాలేదని ఆమె సోదరుడు చిరాగ్ సింఘ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఆ ఫిర్యాదును పట్టించుకోకపోవటంతో నేరుగా కోర్టునే అతను ఆశ్రయించాడు. ఇదిలా ఉంటే తాను ఏప్రిల్‌లో ఫయాజ్ మహ్మద్‌ను వివాహం చేసుకున్నట్లు యువతి రాతపూర్వకంగా కోర్టుకు తెలిపింది. కానీ, పాయల్ కుటుంబ సభ్యులు మాత్రం అపహరణ, బెదిరింపులతో ఆమెను లొంగదీసుకున్నారని.. వివాహ ధృవీకరణ నకిలీ పత్రాలు సృష్టించారని వాదిస్తున్నారు. చివరకు ఇరు పక్షాల వాదనలు విన్న రాజస్థాన్ హైకోర్టు యువతిని ప్రభుత్వ వసతి గృహానికి తరలించాలని పోలీసులను ఆదేశిస్తూ నవంబర్ 7కి తదుపరి విచారణ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment