రాజస్థాన్‌లో ముగిసిన ప్రచారం
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం ఐదుగంటలతో తెరపడింది. డిసెంబర్ 1న జరగనున్న పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 200 స్థానాలకుగానూ 199 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో చురు అసెంబ్లీ స్థానం ఎన్నిక డిసెంబర్ 13కు వాయిదా పడింది. మొత్తం 2,087 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారి భవితవ్యాన్ని 4.08 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఇందుకోసం 47,200 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య కేంద్రీకృతమైంది.
ఈ రెండు పార్టీలు అన్ని నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీఎస్పీ(195), సీపీఎం(38), సీపీఐ(23), ఎన్‌సీపీ(16)లతోపాటు స్వతంత్రులు 758 మంది కూడా ఎన్నికల బరిలో నిలిచారు. అధికార కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రధాని మన్మోహన్ సైతం జైపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. మరోవైపు బీజేపీ తరఫున ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్ తదితరులు ప్రచారం చేశారు.