నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. సోమవారం ఎన్నికల ర్యాలీలో భాగంగా ఢిల్లీలోని శ్యాం నగర్ లో నిరంజన్ జ్యోతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ' మీరు రామరాజ్యం వైపు ఉంటారా? లేక అసాంఘిక శక్తుల వైపు ఉంటారా? నిర్ణయించుకోవాలంటూ ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. దీంతో ఈ రోజు ఉభయ సభలు దద్దరిల్లాయి. రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు ఆమె వ్యాఖ్యలపై మండిపడ్డాయి. ఈ అంశంపై రాజ్యసభ సభ్యులు తమ ఆందోళనను తీవ్రతరం చేయడంతో సభను రెండు గంటల వరకూ వాయిదా వేశారు.
మంత్రి నిరంజన జ్యోతి వ్యాఖ్యల వివాదాన్ని ఇవాళ కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలో కూడా లేవనెత్తారు. మంత్రి వ్యాఖ్యలు రెచ్చగొట్టే రీతిలో ఉన్నాయని మంత్రి సభకు క్షమాపణలతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.