Sadhvi Niranjan Jyoti
-
కిచిడి చేసిన కేంద్రమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి కిచిడి చేశారు. వరల్డ్ ఫుడ్ ఈవెంట్ సందర్భంగా చెఫ్ ఇతియాజ్ ఖురేషి, చెఫ్ రణవీర్ బ్రార్‌లతో కలిసి ఆమె కిచిడి ప్రీపేర్ చేశారు. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో ఏకంగా 800 కేజీల ధాన్యాలతో 'బ్రాండ్ ఇండియా కిచిడి'ని తయారు చేసి వరల్డ్ రికార్డు కొట్టేయాలని భారత్ చూస్తోంది. 800 కేజీల ధాన్యాలతో కిచిడిని తయారుచేసే కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. వైవిధ్యంలో దేశ ఐక్యతను సూచించే విధంగా బియ్యం, పప్పులు, ముతక ధాన్యాలు, సుగంధ ధాన్యాలతో కిచిడిని తయారుచేయనున్నారు. సీఐఐతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పాకశాస్త్ర ప్రావీణ్యుడు సంజీవ్ కపూర్ పర్యవేక్షణలో ఈ వంటకాన్ని తయారుచేస్తారు. కిచిడి భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహారమని, ఆరోగ్యకరమైన ఆహారంగా ఇది పరిగణించబడుతుందని ఫుల్ ప్రాసెసింగ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. వైవిధ్యంలో ఐక్యత సూచించే దేశీయ ఉన్నత సంప్రదాయానికి కిచిడి ఓ ప్రతీకగా నిలుస్తుందన్నారు. నేడు తయారుచేసే ఈ కిచిడిని 60వేల మంది అనాధ పిల్లలకు, ఈవెంట్లో పాల్గొనే గెస్ట్‌లకు వడ్డించనున్నారు. రెసిఫీతో పాటు ఫారిన్ మిషన్‌లో ఉన్న అధినేతలందరికీ ఈ వంటకాన్ని పంచనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రెస్టారెంట్లు, కిచెన్లలో కిచిడి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. -
'చిన్నారులకు పశువుల దాణా'
భోపాల్: గతంలో ఓ సారి వివాదాస్పద వ్యాఖ్యలుచేసి పతాకశీర్శికల్లో కనిపించిన కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తాజాగా మరోసారి అదేపని చేశారు. అయితే ఈసారి ఆమె మాట్లాడింది మతసంబంధిత విషయంకాదు. చిన్నారుల పౌష్టికాహారం గురించి. భోపాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శుక్రవారం నిర్వహించిన ఓ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాధ్వి.. అంగన్ వాడీల్లో పిల్లలకు అందిస్తోన్న ఆహారంపై స్పందించారు. 'పౌష్టికాహారం పేరుతో అన్ని అంగన్ వాడీ సెంటర్లలో చిన్నారులు, మహిళలకు పశువుల దాణా పెడుతున్నారు. నిజానికి ఆ ఆహారం బలవర్దకమైనదో కాదో ఎవ్వరికీ తెలియదు' అని వ్యాఖ్యానించారు. ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుతో ఈ సమస్యను అధిగమించొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కొరత ఉందని, వాటి సంఖ్యను పెంచాల్సిఉందన్నారు. ప్రముఖ ఆహార శుద్ధి సంస్థ రుచి గ్రూప్ మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో ఏర్పాటుచేసిన నూతన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. -
'నరేంద్ర మోదీ యుగపురుషుడు'
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రశంసలు కురిపించారు. ఆయనను 'యుగపురుషుడు' అని కీర్తించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుజరాత్ కు వచ్చిన ఆమె ఆదివారం గాంధీనగర్ లో విలేకరులతో మాట్లాడారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మ గాంధీ, యుగపురుషుడు... ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీలను గుజరాత్ కు చెందిన వారని సాధ్వి నిరంజన్ అన్నారు. రామమందిరం నిర్మాణం గురించి ప్రశ్నించగా... 'వారు మందిరం నిర్మిస్తారు. మేము నిర్మించబోం' అని సమాధానమిచ్చారు. దీనిపై ఇంకా మాట్లాడేందుకు నిరాకరించారు. ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేసి ఆమె చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. -
పరుష వ్యాఖ్యల వెనక అసలు ఆంతర్యం?!
విశ్లేషణ ఈ వారం ఒక కేంద్ర మంత్రి భారతీయులను రామ్జాదాలు (హిందువులని అర్థం) లేక హరా మ్జాదాలు (అక్రమ సంతానం) అంటూ వేరు పర్చడాన్ని మనం చూశాం. భారతీయ జనతా పార్టీలో చేరిన పలువురు నిరక్షర లేదా అర్థ నిరక్షర సాధ్విలలో ఈమె కూడా ఒకరు. మీడి యా విరుచుకుపడ్డాక మంత్రి సాధ్వి నిరంజన ముక్తసరిగా ఒక పశ్చాత్తాప ప్రకటన చేశారు. ఇలాంటి అసభ్య భాషను హిందుత్వ పార్టీలు తమ పునాదిని బలపర్చు కోవడం కోసం తరచుగా ఉపయోగించేవి. మీడియాలో రచ్చ జరిగాక ప్రతిపక్షం దాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చింది. కేంద్రమంత్రి అరు ణ్ జైట్లీ, సాధ్వి నిరంజన ప్రకటనను ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం వెంటనే ఈ అంశంపై స్పందించలేదు. అలాంటి వ్యాఖ్య ల వెనుక ఉన్న సంకేతం ప్రబలమైనదని ఆయనకు తెలుసు. ఆ తర్వాత ప్రధాని దీనిపై ఒక వార్తను లోపాయికారిగా లీక్ చేశా రు. నేతలు తమ మాటల విషయంలో జాగ్రత్త పడాలని మోదీ అంతర్గ త సమావేశంలో హెచ్చరించారన్నదే ఆ వార్త. అయితే ఈ హెచ్చరికలో ఖండనను పోలిన స్పష్టత లేకపోవడం గమనార్హం. తన మంత్రులు, ఎంపీలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోనంటూ మోదీ గట్టి సందే శాన్ని ఇవ్వాలనుకుని ఉంటే, మంత్రివర్గం నుంచి నిరంజనను తొలగిం చడమే సరైన చర్య అయి ఉండేది. పాత్రధారిని నేరుగా విమర్శించ కుండా ఆమె చర్యలను మాత్రమే విమర్శించడం వల్ల ఏమీ ఒరగదు. వాస్తవానికి మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల దాడులను దారి మళ్లించడానికి క్షమాపణను ప్రతిపాదించినట్లు కనబ డుతోంది. ప్రతిపక్షం మోదీ చేసిన ఈ తప్పును పసిగట్టి దాన్ని అనుకూ లంగా మార్చుకోవడానికి మరింత ఒత్తిడి చేసింది. అప్పుడు మాత్రమే మోదీ పార్లమెంటుకు వచ్చి ఎవరైనా సరే అలాంటి వ్యాఖ్యలను చేయ కూడదంటూ వివరణ ఇచ్చారు. అయితే హిందుత్వ తరపున వ్యవహరి స్తున్నవారు అలాంటి మాటలు ఎందుకు వాడుతున్నారన్నదే ప్రశ్న. బీజేపీ అనామక అభ్యర్థి గిరిరాజ్ సింగ్ ఎన్నికల ప్రచార కార్యక్ర మంలో ఒక వ్యాఖ్య చేయడం ద్వారా ఉన్నట్లుండి వెలుగులోకి వచ్చారు. ఆయన మాటల ప్రకారం ‘నరేంద్రమోదీని అడ్డుకోవాలని భావిస్తున్న వారు పాకిస్తాన్ మద్దతుకోసం చూస్తున్నారు. రాబోయే రోజుల్లో, ఇలాం టి వ్యక్తులకు భారత్‌లో, జార్ఖండ్‌లో చోటు ఉండదు. ఎందుకంటే పాకిస్తానే వారికి సరైన చోటు’. అదేసమయంలో వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా గుజరాత్లో ఒక సభలో మాట్లాడిన టేప్ లీక్ అయింది. దావూది బోహ్రా అనే వ్యక్తి ఆస్తి కొనుగోలు ఘటనలో పొరుగున నివసిస్తున్న ఒక హిందువు తొగాడియా సలహాను అర్థించారు. భారత్ లోని సంపన్న కమ్యూనిటీల్లో బోహ్రా ఒకటి. వీరు సున్నీ ముస్లింలతో కలిసి జీవించలేరు. హిందువులు అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో నివసించడానికే బోహ్రాలు మొగ్గు చూపుతారు. కాని తొగాడియాను సల హా కోరిన హిందూ వ్యక్తి, ఈ బోహ్రా కుటుంబం తమ పక్కన నివసిం చడానికి ఇష్టపడలేదు. దాంతో బోహ్రా కుటుంబంలో చీలికలు, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి వారు చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఆస్తి నుంచి వారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేయాలని తొగాడియా సల హా ఇచ్చారు. ఇది వీడియోలో కూడా రికార్డయింది. ఈ రెండు ఘటనలు ఒకే సమయంలో జరిగాయి. దాంతో తమ కేంపెయిన్‌ను దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారంటూ మోదీ ఒక సాధారణ ట్వీట్‌తో సరిపెట్టేశారు. మోదీ తర్వాత గిరిరాజ్‌ను మంత్రిని చేసేశారు. గుజరాతీ మాట్లాడలేని వారు తొగాడియా మాటలను తప్పు గా అర్థం చేసుకుని ఉండవచ్చని ఆరెస్సెస్ కూడా బొంకింది. (కాని నేను ఆ పూర్తి పాఠాన్ని లైవ్‌మింట్.కామ్ నుంచి యథాతథంగా అనువ దించాను.) తొగాడియా వీహెచ్‌పీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దీనికి కారణం ఉంది. ఒకవైపు ముక్తసరిగా అర్థ ఖండనలు చేస్తున్న ప్పటికీ మరోవైపు మోదీ, ఆరెస్సెస్ ఇలాంటి అభ్యంతరకర ప్రకట నలను ఆమోదిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను ప్రోత్స హిస్తున్నారు. ఎందుకంటే భారత్‌లోని ఒక సువిశాల ప్రాంతం ఇలాంటి వ్యక్తులపట్ల అనుకూలంగా స్పందిస్తోంది మరి. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) -
ఫలించని ప్రధాని ప్రయత్నం
సాధ్వి వ్యాఖ్యలపై కొనసాగిన నిరసనలు లోక్‌సభలో ప్రధాని ప్రకటన బహిరంగంగా మాట్లాడేటపుడు పరిధులు తెలుసుకోవాలి కాంగ్రెస్ వాకౌట్ న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై పార్లమెంట్లో నిరసనల పరంపర కొనసాగింది. లోక్‌సభలో ప్రతిపక్షాలతో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంధి ప్రయత్నాలూ ఫలించలేదు. ఆయన సభలో ప్రకటన చేసినా ప్రతిపక్షాలు సంతృప్తి చెందక శుక్రవారమూ నిరసనను కొనసాగించాయి. లోక్‌సభలో ప్రధాని మాట్లాడుతూ.. బహిరంగంగా మాట్లాడేటపుడు ప్రతి ఒక్కరు తమ పరిధులు తెలుసుకోవాలని చెప్పారు. ఎవరూ ఆమె వ్యాఖ్యల్ని సమర్థించరని, అలాంటి పదాలు వాడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తమ సభ్యులకు గట్టిగా చెప్పాననన్నారు. మంత్రి క్షమాపణలు చెప్పిన తర్వాత ఆ విషయాన్ని ముగించి, జాతి ప్రయోజనాల దృష్ట్యా సభ సజావుగా కొనసాగేలా చూడాలని కోరారు. జ్యోతి గ్రామీణ నేపథ్యాన్నీ దృష్టి పెట్టుకోవాలన్నారు. ప్రధాని ప్రకటనతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఆ పార్టీ నేతలు నోటికి నల్లగుడ్డ కట్టుకుని నిరసన తెలిపారు. ప్రధాని ప్రసంగం తర్వాత వాకౌట్ చేశారు. తర్వాత మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఎవరిపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తున్నారని, వాళ్లు చేసే పనులు వాళ్లకే తిరిగి తగులుతాయని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అంతకుముందు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. తాము వ్యక్తులకు వ్యతిరేకం కాదన్నారు. రాజ్యసభలో కూడా నాలుగోరోజు ప్రతిష్టంభన కొనసాగింది. నిరసనల మధ్య నాలుగు సార్లు వాయిదా పడింది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు చర్చించి సోమవారంలోగా ప్రతిష్టంభన తొలగించాలని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సూచించారు. కాగా, జ్యోతిని అభిశంసిస్తూ ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించాలని రాజ్యసభలో 9 విపక్షాలు శుక్రవారం ప్రతిపాదించాయి. ఆమెను మంత్రిపదవినుంచి తక్షణం తొలగించవలసిన అవసరం ఉందని పేర్కొన్న ఉమ్మడి ప్రకటనపై కాంగ్రెస్, సమాజవాదీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ నేతలు సంతకాలు చేశారు. పార్లమెంట్ ఆవరణలో నిరసనలు పార్లమెంట్ వేదికగా శుక్రవారం అధికార, విపక్ష పార్టీలు పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. పార్లమెంట్ కార్యకలాపాలకు ముందు కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ, ఆమ్ఆద్మీ, ఆర్జేడీ, సీపీఐ సభ్యులు మంత్రి సాధ్వీ జ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలపై పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష ఎంపీలంతా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. జ్యోతిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విపక్షాల గొంతు నొక్కాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు నిరసనగా దీన్ని చేపట్టినట్టు రాహుల్ చెప్పారు. మరోవైప బీజేపీ సభ్యులు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఇందులో ఐదుగురు కేంద్ర మంత్రులు సదానంద గౌడ, అనంత్‌కుమార్, తావర్‌చంద్ గెహ్లట్, పాస్వాన్, నఖ్వీ తదితరులు పాల్గొన్నారు. -
'ఆమె వ్యాఖ్యలను పెద్దమనసుతో క్షమించండి'
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మంత్రిగా కొత్తవారని... ఆమె వ్యాఖ్యలను పెద్ద మనసుతో క్షమించాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లోక్‌సభ సభ్యులను కోరారు. నిన్న రాజ్యసభలో సాధ్వి నిరంజన్ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ప్రధాని మోదీ ఇవాళ లోక్‌సభ సభ్యులకు కూడా వివరణ ఇచ్చారు. గత కొద్దిరోజులుగా సభలో ఎలాంటి కార్యకలాపాలు సాగనీయకపోవడం వల్ల చర్చించాల్సిన అనేక అంశాలు పెండింగ్‌లో పడుతున్నాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మనసుతో సభ్యులందరూ అర్థం చేసుకోవాలన్నారు. -
సాధ్వి రాజీనామా చేయాల్సిందే
* పార్లమెంటులో విపక్షాల నిరసన * నినాదాలతో బుధవారం కూడా దద్దరిల్లిన ఉభయ సభలు * ఆమె రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వం * కాంగ్రెస్, టీఎంసీ సహా విపక్షాల వాకౌట్ న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి రాజీనామా చేయాల్సిందేనని పార్లమెంటులో విపక్షాలు పట్టుబట్టాయి. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిరసనలు, నినాదాలతో బుధవారం కూడా ఉభయ సభలు దద్దరిల్లాయి. సాధ్వి రాజీనామా చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆమె క్షమాపణ చెప్పినందున రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. సోమవారం ఢిల్లీలో జరిగిన ఒక సభలో సాధ్వి మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది రాముడి సంతానమా? లేక అక్రమ సంతానమా? అన్నది తేల్చాల్సింది మీరే..’ అని వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై నిరసన వెల్లువెత్తడంతో సాధ్వి మంగళవారం లోక్‌సభలో క్షమాపణ చెప్పారు. అయినా విపక్షాలు తమ పట్టు వీడలేదు. బుధవారం ఉదయం లోక్‌సభ, రాజ్యసభ సమావేశం కాగానే... ఇరు సభల్లో ప్రతిపక్షాల సభ్యులు మళ్లీ నిరసన ప్రారంభించారు. తొలుత లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెకు పదవిలో కొనసాగే అర్హత లేదని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మిగతా కాంగ్రెస్ సభ్యులు, తృణమూల్, సమాజ్‌వాదీ, ఆమ్ఆద్మీ తదితర పార్టీల సభ్యులు జత కలిశారు. సాధ్విని మంత్రిగా కొనసాగించడంలో అర్థం లేదని.. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలని వెల్‌లోకి దూసుకెళ్లారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందిస్తూ.. రికార్డులను పరిశీలిస్తే చాలా మంది సభ్యులు తమ వ్యక్తిగత జీవితంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతోందన్నారు. సభ కొనసాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినా విపక్షాలు శాంతించలేదు. దీనిపై మాట్లాడేందుకు అవకాశమివ్వాలన్న విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించడంతో... కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, వామపక్షాలు, ఎన్సీపీ, ఏఏపీ, ఆర్ఎస్పీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సాధ్వి వ్యాఖ్యల అంశంపై రాజ్యసభలోనూ విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. ఆమె రాజీనామా డిమాండ్‌తో సభను హోరెత్తించాయి. ప్రధాని వివరణకు పట్టుపట్టడంతో సభ ఆరుసార్లు వాయిదా పడింది. దేశం కోసమే మోదీ విదేశీ పర్యటనలు అంతర్జాతీయ సంబంధాలను పునర్నిర్మించుకోవాలన్న సంకల్పంతో, కొత్త లక్ష్యాలను ఏర్పర్చుకుంటూ విదేశాంగ విధానంలో ప్రభుత్వం శరవేగంతో దూసుకుపోతోందని విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ లోక్‌సభలో పేర్కొన్నారు. భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సురక్షిత, సుస్థిర వాతావరణాన్ని కల్పించేందుకు ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు దోహదపడ్తాయన్నారు. వ్యవహారం ముగిసిపోయింది ఈ వ్యవహారంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో ఒక కేంద్ర మంత్రి వాజ్‌పేయిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ క్షమాపణ చెప్పిన అంశాన్ని, తృణమూల్ ఎంపీ తపస్‌పాల్ వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని గుర్తుచేసి... ఆయా పార్టీలు కొంత వెనక్కితగ్గేలా చేయగలిగారు. సాధ్వి క్షమాపణ చెప్పినందున ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిపోయిందని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. 520 మంది ఉన్న సభపై 20 మంది ప్రతిపక్ష సభ్యులు వారి ఇష్టాన్ని రుద్దాలని చూస్తే మిగతా సభ్యులు ఊరుకోబోరన్నారు. -
ఐదేళ్లు తాము చెప్పింది వినాల్సిందే..
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై పార్లమెంట్లో రెండోరోజు గందరగోళం చోటుచేసుకుంది. మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలన్న విపక్ష సభ్యుల డిమాండ్‌తో రాజ్యసభ అట్టుడికింది. 'ప్రధాన్ మంత్రి జవాబ్ దేవ్' అంటు కాంగ్రెస్ సభ్యులు పోడియం చుట్టుముట్టారు. వీరికి మిగిలిన పార్టీల సభ్యులు మద్దతు తెలిపారు. అనుచితంగా మాట్లాడిన మంత్రిని మంత్రిమండలి నుంచి తొలగించాలని సమాజ్ వాదీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మంత్రి సాధ్వీ నిరంజన చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని సర్దిచెప్పారు. విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో... ఐదేళ్లు తాము చెప్పింది వినాల్సిందేనని వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజ్ వాదీ డిమాండ్‌ను తాము సమర్థించేది లేదని, మంత్రి పార్లమెంట్ వెలుపల వ్యాఖ్యలు చేశారన్నారు. ఆమె సభకు వచ్చి తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారని, క్షమాపణ కూడా చెప్పారని వెంకయ్య నాయుడు అన్నారు. అయితే వెంకయ్య నాయుడు మాట్లాడుతుండగానే విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే విపక్ష సభ్యుల తీరుపై డిప్యూటీ చైర్మన్ కురియన్ తీవ్రంగా మండిపడ్డారు. కాగా సాధారణంగా సభలో గందరగోళం చోటుచేసుకున్నప్పుడు రాజ్యసభ ఛానెల్ కేవలం సభాపతిని చూపిస్తుంది. అయితే ఈ గందరగోళం సందర్భంగా కెమెరాను వైడ్ ఫ్రేమ్‌లో పెట్టారు. గందరగోళం మొత్తాన్ని టీవీలో కవర్ చేశారు. సభను తాను వాయిదా వేయనని ఉపాధ్యక్షుడు పిజె కురియన్ స్పష్టం చేశారు. గందరగోళం మధ్యే హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై ప్రకటన చేశారు. సభ్యులు శాంతించాలని అంతా వెళ్లి కుర్చొవాలని ఉపాధ్యక్షుడు పదేపదే విజ్ఞప్తి చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో సభను పది నిమిషాలు వాయిదా వేశారు. లోక్‌సభలోనూ ఇదే అంశంపై రభస చోటుచేసుకుంది. దాంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. -
సాధ్వి వ్యాఖ్యలపై దుమారం
క్షమాపణలు చెప్పినా శాంతించని విపక్షం న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి సోమవారం ఢిల్లీలో చేసిన అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలపై మంగళవారం పార్లమెంటు దద్ధరిల్లింది. మంత్రిమండలి నుంచి ఆమెను తొలగించాలని, ఆ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్రమోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు ఉభయ సభలను అడ్డుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య రాజ్యసభ 4 వాయిదాల అనంతరం బుధవారం నాటికి వాయిదా పడింది. ఢిల్లీలో సోమవారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ సాధ్వి జ్యోతి ‘ఢిల్లీలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది రాముడి సంతానమా? లేక అక్రమ సంతానమా?.. తేల్చాల్సింది మీరే’ అంటూ చేసిన దుర్భాషాపూరిత వ్యాఖ్యపై రాజకీయాలకు అతీతంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోదీ కూడా బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ‘అసందర్భ ప్రేలాపనలు చేయొద్ద’ంటూ బీజేపీ ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. ఇలాంటివి తాను సహించబోనన్నారు. జ్యోతి వ్యాఖ్యలపై పార్లమెంట్లో విపక్ష సభ్యులు తీవ్రంగా స్పందించడంతో ఆమె ఉభయ సభల్లోనూ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ‘నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ, వాటిపై విచారం వ్యక్తం చేస్తున్నాను. సభ కోరితే క్షమాపణలు కోరేందుకు కూడా నేను సిద్ధం’ అని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ శాంతించని విపక్ష సభ్యులు.. ఆమె రాజీనామాచేయాల్సిందేనని పట్టుపట్టారు. మంగళవారం ఉభయసభలు ప్రారంభం కాగానే సాధ్వి జ్యోతి వ్యాఖ్యల అంశాన్ని విపక్షాలు లేవనెత్తాయి. ఉభయసభల్లోనూ ఈ అంశంపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, వామపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి మంత్రిమండలి నుంచి సాధ్వి జ్యోతిని తొలగించాలని, మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. రాజ్యసభలో సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ‘ఇలాంటి వ్యాఖ్యలపై కేవలం క్షమాపణ సరిపోదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే’ అని పేర్కొన్న సుప్రీంకోర్టు, కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తు చేశారు. ఈ అంశంపై స్పందించేందుకు మోదీ సభకు రావాలని డిమాండ్ చేశారు. ‘బ్లాక్ మనీ తేనక్కరలేదు. మీరు సభకు రండి చాలు’ అని వ్యాఖ్యానించారు. టీఎంసీ నేత డెరిక్ ఓబ్రీన్ మాట్లాడుతూ.. ‘రాజ్యసభకు వచ్చేందుకు దేశ ప్రధానికి వీసా మంజూరు చేయండి’ అని వ్యాఖ్యానించారు. అధికార పక్ష నేత అరుణ్ జైట్లీ కూడా సాధ్వి జ్యోతి వ్యాఖ్యలు ఆమోదనీయం కాదన్నారు. సాధ్వి జ్యోతి క్షమాపణలు చెప్పినందువల్ల ఈ అంశాన్ని ఇంతటితో వదిలేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. సాధ్వి జ్యోతి వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించకపోవడాన్ని నేరపూరిత మౌనంగా కాంగ్రెస్ అభివర్ణించింది. -
నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. సోమవారం ఎన్నికల ర్యాలీలో భాగంగా ఢిల్లీలోని శ్యాం నగర్ లో నిరంజన్ జ్యోతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ' మీరు రామరాజ్యం వైపు ఉంటారా? లేక అసాంఘిక శక్తుల వైపు ఉంటారా? నిర్ణయించుకోవాలంటూ ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. దీంతో ఈ రోజు ఉభయ సభలు దద్దరిల్లాయి. రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు ఆమె వ్యాఖ్యలపై మండిపడ్డాయి. ఈ అంశంపై రాజ్యసభ సభ్యులు తమ ఆందోళనను తీవ్రతరం చేయడంతో సభను రెండు గంటల వరకూ వాయిదా వేశారు. మంత్రి నిరంజన జ్యోతి వ్యాఖ్యల వివాదాన్ని ఇవాళ కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలో కూడా లేవనెత్తారు. మంత్రి వ్యాఖ్యలు రెచ్చగొట్టే రీతిలో ఉన్నాయని మంత్రి సభకు క్షమాపణలతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
అలా అనటం తప్పే...క్షమాపణ చెప్పిన సాథ్వీ
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి మంగళవారం లోక్‌సభలో క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాధ్వీ నిరంజన్ జ్యోతి 'రామరాజ్యం వైపు ఉంటారా? లేక అసాంఘిక శక్తుల వైపు ఉంటారో.. ఎటువైపుంటారో ఢిల్లీ ప్రజలే నిర్ణయించుకోవాలి' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి నిరంజన జ్యోతి వ్యాఖ్యల వివాదాన్ని.. ఇవాళ కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలో లేవనెత్తారు. మంత్రి వ్యాఖ్యలు రెచ్చగొట్టే రీతిలో ఉన్నాయని మంత్రి సభకు క్షమాపణలతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించడంతో... కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. సమావేశాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఇదే అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి వెంకయ్య నాయుడుతో చర్చలు జరిపిన అనంతరం సాధ్వీ నిరంజన్ జ్యోతి..సభకు క్షమాపణ చెప్పారు. మరోవైపు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. మొత్తం 25 అంశాలపై మోదీ ప్రభుత్వం వెనకడుగువేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్‌సభ సమావేశం ప్రారంభానికి కాంగ్రెస్ ఎంపీలంతా పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ధర్నాకు నాయకత్వం వహించారు. -
మహిళలు 8 మందే !
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య ఎనిమిదికి చేరింది. కొత్తగా ఈరోజు జరిగిన విస్తరణలో ఒక్క మహిళకే చోటు దక్కింది. యూపీకి చెందిన ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి ఈ రోజు సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం మంత్రి మండలిలో సుష్మా స్వరాజ్, ఉమా భారతి, నజ్మా హెప్తుల్లా, మేనకా గాంధీ, హర్సిమ్రత్ కౌర్ బాదల్, స్మతీ ఇరానీ కేబినెట్ హోదా మంత్రులుగా ఉన్నారు. నిర్మలా సీతారామన్ స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రిగా ఉన్నారు. కేబినెట్లోని అత్యంత పెద్ద, పిన్న వయస్కులు మహిళలే కావడం విశేషం. ఎక్కువ వయసు ఉన్న మంత్రి నజ్మా హెప్తుల్లా కాగా, తక్కువ వయసు ఉన్న మంత్రి స్మతి ఇరానీ కావడం గమనార్హం. నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో మొత్తం 66 మంది సభ్యులు ఉండగా, 8 మంది మహిళలకు మాత్రమే స్థానం లభించింది. **