న్యూఢిల్లీ : కేంద్రమంత్రి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై పార్లమెంట్లో రెండోరోజు గందరగోళం చోటుచేసుకుంది. మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలన్న విపక్ష సభ్యుల డిమాండ్‌తో రాజ్యసభ అట్టుడికింది. 'ప్రధాన్ మంత్రి జవాబ్ దేవ్' అంటు కాంగ్రెస్ సభ్యులు పోడియం చుట్టుముట్టారు. వీరికి మిగిలిన పార్టీల సభ్యులు మద్దతు తెలిపారు. అనుచితంగా మాట్లాడిన మంత్రిని మంత్రిమండలి నుంచి తొలగించాలని సమాజ్ వాదీ పార్టీ డిమాండ్ చేసింది.
ఈ క్రమంలోనే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మంత్రి సాధ్వీ నిరంజన చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని సర్దిచెప్పారు. విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో... ఐదేళ్లు తాము చెప్పింది వినాల్సిందేనని వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజ్ వాదీ డిమాండ్ను తాము సమర్థించేది లేదని, మంత్రి పార్లమెంట్ వెలుపల వ్యాఖ్యలు చేశారన్నారు. ఆమె సభకు వచ్చి తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారని, క్షమాపణ కూడా చెప్పారని వెంకయ్య నాయుడు అన్నారు.
అయితే వెంకయ్య నాయుడు మాట్లాడుతుండగానే విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే విపక్ష సభ్యుల తీరుపై డిప్యూటీ చైర్మన్ కురియన్ తీవ్రంగా మండిపడ్డారు. కాగా సాధారణంగా సభలో గందరగోళం చోటుచేసుకున్నప్పుడు రాజ్యసభ ఛానెల్ కేవలం సభాపతిని చూపిస్తుంది.
అయితే ఈ గందరగోళం సందర్భంగా కెమెరాను వైడ్ ఫ్రేమ్‌లో పెట్టారు. గందరగోళం మొత్తాన్ని టీవీలో కవర్ చేశారు. సభను తాను వాయిదా వేయనని ఉపాధ్యక్షుడు పిజె కురియన్ స్పష్టం చేశారు. గందరగోళం మధ్యే హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై ప్రకటన చేశారు. సభ్యులు శాంతించాలని అంతా వెళ్లి కుర్చొవాలని ఉపాధ్యక్షుడు పదేపదే విజ్ఞప్తి చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో సభను పది నిమిషాలు వాయిదా వేశారు. లోక్సభలోనూ ఇదే అంశంపై రభస చోటుచేసుకుంది. దాంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
ఐదేళ్లు తాము చెప్పింది వినాల్సిందే..
Published Wed, Dec 3 2014 12:11 PM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM
Advertisement
Advertisement