
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యులకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కొత్త సలహాలు ఇచ్చారు. సభ్యులు అడిగే ప్రశ్నలు చాలా సంక్షిప్తంగా ఉండాలని, అలాగే సమాధానాలు చాలా సూటిగా ఉండాలని సూచించారు. అలా జరిగినప్పుడు మాత్రమే ప్రశ్నోత్తరాల సమయం సఫలీకృతం అవుతుందని అన్నారు. పెద్దల సభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో కొంతమంది సభ్యులు లేచి ప్రశ్నలను కూడా వ్యాసాల మాదిరిగా చదవడంతోపాటు తమ ప్రశ్నలకు బదులు ఇప్పించండని వెంకయ్యనాయుడిని కోరడంతో ఆయన ఈ విధమైన సూచన సభ్యులకు చేశారు.
'సభ్యుల ప్రశ్నలు సంక్షిప్తంగా ఉండాలి. అలాగే మంత్రులు కూడా విస్తృతంగా సమాధానాలు చెప్పకూడదు. చర్చ జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఇది మీ దృష్టిలో పెట్టుకోండి. కచ్చితంగా ఇక ముందు నుంచే అడిగే ప్రశ్నలు సంక్షిప్తంగానే ఉండాలి' అని ఆయన సెలవిచ్చారు.