రాజ్యసభలో నిరసన తెలుపుతున్న సభ్యులు
* పార్లమెంటులో విపక్షాల నిరసన
* నినాదాలతో బుధవారం కూడా దద్దరిల్లిన ఉభయ సభలు
* ఆమె రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వం
* కాంగ్రెస్, టీఎంసీ సహా విపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి రాజీనామా చేయాల్సిందేనని పార్లమెంటులో విపక్షాలు పట్టుబట్టాయి. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిరసనలు, నినాదాలతో బుధవారం కూడా ఉభయ సభలు దద్దరిల్లాయి. సాధ్వి రాజీనామా చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆమె క్షమాపణ చెప్పినందున రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.
సోమవారం ఢిల్లీలో జరిగిన ఒక సభలో సాధ్వి మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది రాముడి సంతానమా? లేక అక్రమ సంతానమా? అన్నది తేల్చాల్సింది మీరే..’ అని వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై నిరసన వెల్లువెత్తడంతో సాధ్వి మంగళవారం లోక్‌సభలో క్షమాపణ చెప్పారు. అయినా విపక్షాలు తమ పట్టు వీడలేదు. బుధవారం ఉదయం లోక్‌సభ, రాజ్యసభ సమావేశం కాగానే... ఇరు సభల్లో ప్రతిపక్షాల సభ్యులు మళ్లీ నిరసన ప్రారంభించారు. తొలుత లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తారు.
అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెకు పదవిలో కొనసాగే అర్హత లేదని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మిగతా కాంగ్రెస్ సభ్యులు, తృణమూల్, సమాజ్‌వాదీ, ఆమ్‌ఆద్మీ తదితర పార్టీల సభ్యులు జత కలిశారు. సాధ్విని మంత్రిగా కొనసాగించడంలో అర్థం లేదని.. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలని వెల్‌లోకి దూసుకెళ్లారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందిస్తూ.. రికార్డులను పరిశీలిస్తే చాలా మంది సభ్యులు తమ వ్యక్తిగత జీవితంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతోందన్నారు. సభ కొనసాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినా విపక్షాలు శాంతించలేదు. దీనిపై మాట్లాడేందుకు అవకాశమివ్వాలన్న విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించడంతో... కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, వామపక్షాలు, ఎన్సీపీ, ఏఏపీ, ఆర్‌ఎస్పీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సాధ్వి వ్యాఖ్యల అంశంపై రాజ్యసభలోనూ విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. ఆమె రాజీనామా డిమాండ్‌తో సభను హోరెత్తించాయి. ప్రధాని వివరణకు పట్టుపట్టడంతో సభ ఆరుసార్లు వాయిదా పడింది.
దేశం కోసమే మోదీ విదేశీ పర్యటనలు
అంతర్జాతీయ సంబంధాలను పునర్నిర్మించుకోవాలన్న సంకల్పంతో, కొత్త లక్ష్యాలను ఏర్పర్చుకుంటూ విదేశాంగ విధానంలో ప్రభుత్వం శరవేగంతో దూసుకుపోతోందని విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ లోక్‌సభలో పేర్కొన్నారు. భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సురక్షిత, సుస్థిర వాతావరణాన్ని కల్పించేందుకు ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు దోహదపడ్తాయన్నారు.
వ్యవహారం ముగిసిపోయింది
ఈ వ్యవహారంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో ఒక కేంద్ర మంత్రి వాజ్‌పేయిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ క్షమాపణ చెప్పిన అంశాన్ని, తృణమూల్ ఎంపీ తపస్‌పాల్ వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని గుర్తుచేసి... ఆయా పార్టీలు కొంత వెనక్కితగ్గేలా చేయగలిగారు. సాధ్వి క్షమాపణ చెప్పినందున ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిపోయిందని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. 520 మంది ఉన్న సభపై 20 మంది ప్రతిపక్ష సభ్యులు వారి ఇష్టాన్ని రుద్దాలని చూస్తే మిగతా సభ్యులు ఊరుకోబోరన్నారు.