సాధ్వి వ్యాఖ్యలపై దుమారం
క్షమాపణలు చెప్పినా శాంతించని విపక్షం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి సోమవారం ఢిల్లీలో చేసిన అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలపై మంగళవారం పార్లమెంటు దద్ధరిల్లింది. మంత్రిమండలి నుంచి ఆమెను తొలగించాలని, ఆ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్రమోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు ఉభయ సభలను అడ్డుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య రాజ్యసభ 4 వాయిదాల అనంతరం బుధవారం నాటికి వాయిదా పడింది.
ఢిల్లీలో సోమవారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ సాధ్వి జ్యోతి ‘ఢిల్లీలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది రాముడి సంతానమా? లేక అక్రమ సంతానమా?.. తేల్చాల్సింది మీరే’ అంటూ చేసిన దుర్భాషాపూరిత వ్యాఖ్యపై రాజకీయాలకు అతీతంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోదీ కూడా బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ‘అసందర్భ ప్రేలాపనలు చేయొద్ద’ంటూ బీజేపీ ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. ఇలాంటివి తాను సహించబోనన్నారు.
జ్యోతి వ్యాఖ్యలపై పార్లమెంట్లో విపక్ష సభ్యులు తీవ్రంగా స్పందించడంతో ఆమె ఉభయ సభల్లోనూ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ‘నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ, వాటిపై విచారం వ్యక్తం చేస్తున్నాను. సభ కోరితే క్షమాపణలు కోరేందుకు కూడా నేను సిద్ధం’ అని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ శాంతించని విపక్ష సభ్యులు.. ఆమె రాజీనామాచేయాల్సిందేనని పట్టుపట్టారు.
మంగళవారం ఉభయసభలు ప్రారంభం కాగానే సాధ్వి జ్యోతి వ్యాఖ్యల అంశాన్ని విపక్షాలు లేవనెత్తాయి. ఉభయసభల్లోనూ ఈ అంశంపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, వామపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి మంత్రిమండలి నుంచి సాధ్వి జ్యోతిని తొలగించాలని, మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. రాజ్యసభలో సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ‘ఇలాంటి వ్యాఖ్యలపై కేవలం క్షమాపణ సరిపోదు, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందే’ అని పేర్కొన్న సుప్రీంకోర్టు, కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తు చేశారు.
ఈ అంశంపై స్పందించేందుకు మోదీ సభకు రావాలని డిమాండ్ చేశారు. ‘బ్లాక్ మనీ తేనక్కరలేదు. మీరు సభకు రండి చాలు’ అని వ్యాఖ్యానించారు. టీఎంసీ నేత డెరిక్ ఓబ్రీన్ మాట్లాడుతూ.. ‘రాజ్యసభకు వచ్చేందుకు దేశ ప్రధానికి వీసా మంజూరు చేయండి’ అని వ్యాఖ్యానించారు. అధికార పక్ష నేత అరుణ్ జైట్లీ కూడా సాధ్వి జ్యోతి వ్యాఖ్యలు ఆమోదనీయం కాదన్నారు. సాధ్వి జ్యోతి క్షమాపణలు చెప్పినందువల్ల ఈ అంశాన్ని ఇంతటితో వదిలేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. సాధ్వి జ్యోతి వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించకపోవడాన్ని నేరపూరిత మౌనంగా కాంగ్రెస్ అభివర్ణించింది.