అలా అనటం తప్పే...క్షమాపణ చెప్పిన సాథ్వీ
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి మంగళవారం లోక్సభలో క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాధ్వీ నిరంజన్ జ్యోతి 'రామరాజ్యం వైపు ఉంటారా? లేక అసాంఘిక శక్తుల వైపు ఉంటారో.. ఎటువైపుంటారో ఢిల్లీ ప్రజలే నిర్ణయించుకోవాలి' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మంత్రి నిరంజన జ్యోతి వ్యాఖ్యల వివాదాన్ని.. ఇవాళ కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలో లేవనెత్తారు. మంత్రి వ్యాఖ్యలు రెచ్చగొట్టే రీతిలో ఉన్నాయని మంత్రి సభకు క్షమాపణలతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించడంతో... కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. సమావేశాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఇదే అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి వెంకయ్య నాయుడుతో చర్చలు జరిపిన అనంతరం సాధ్వీ నిరంజన్ జ్యోతి..సభకు క్షమాపణ చెప్పారు.
మరోవైపు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. మొత్తం 25 అంశాలపై మోదీ ప్రభుత్వం వెనకడుగువేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్‌సభ సమావేశం ప్రారంభానికి కాంగ్రెస్ ఎంపీలంతా పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ధర్నాకు నాయకత్వం వహించారు.