పోలవరం బిల్లుకు పెద్దల సభ ఓకే | Rajya sabha approves polavaram bill | Sakshi
Sakshi News home page

పోలవరం బిల్లుకు పెద్దల సభ ఓకే

Published Tue, Jul 15 2014 1:49 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

పోలవరం బిల్లుకు పెద్దల సభ ఓకే - Sakshi

పోలవరం బిల్లుకు పెద్దల సభ ఓకే

సాక్షి, న్యూఢిల్లీ:

 పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లాలో ముంపునకు గురయ్యే పలు మండలాలు, గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు - 2014కు సోమవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. గత శుక్రవారం నాడే లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు కె.కేశవరావు ‘పోలవరం ఆర్డినెన్స్‌ను ఈ సభ ఆమోదించడం లేదు’ అంటూ తెచ్చిన స్టాట్యుటరీ రిజల్యూషన్ వీగిపోయింది. ఈ రెండు అంశాలను కలిపి సభలో చర్చకు పెట్టగా దాదాపు 3 గంటలకు పైగా చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవ ర్ధన్‌రెడ్డి కూడా స్టాట్యుటరీ రిజల్యూషన్ ఇచ్చినప్పటికీ ఆయన చర్చ సమయంలో తాను రిజల్యూషన్‌ను సభ ముందుంచడం లేదని పేర్కొన్నారు. తరువాత టీఆర్‌ఎస్ సభ్యుడు కె.కేశవరావు బిల్లును, రిజల్యూషన్‌ను విడిగా చర్చించాలని కోరగా సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కురియన్ అంగీకరించలేదు. ఆర్డినెన్స్ వచ్చినప్పుడు ఆనవాయితీ ప్రకారం రెండూ కలిపి చర్చకు పెడతామని చెప్పారు. స్టాట్యుటరీ రిజల్యూషన్ ప్రవేశపెట్టేందుకు కేకే లేచి మాట్లాడుతూ.. ‘ఆర్టికల్ 3 ప్రకారం తేవాల్సిన చట్టాన్ని ఆర్డినెన్స్ రూపంలో తేవడం ఏ మేరకు సమంజసం? ఇలాంటి పద్ధతులను మీరు అంగీకరిస్తారా? దీనిపై మీరు తగిన ఆదేశాలు ఇవ్వండి...’ అని పేర్కొనగా.. దీనిపై హోంమంత్రి సమాధానమిస్తారని డిప్యూటీ చైర్మన్ పేర్కొంటూ బిల్లును ప్రవేశపెట్టాలని హోంమంత్రికి సూచించారు. ఆయన బిల్లు పూర్వాపరాలను వివరిస్తూ.. ముంపు ప్రాంతాలను ఏపీలో కలపటం ద్వారా ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన పునరావాసం కల్పించేందుకు దోహదపడుతుందని చెప్పి బిల్లును ఆమోదించాలని సభను కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరాంరమేశ్ చర్చను ప్రారంభించారు. ముంపు ప్రాంతాలను ఏపీలో కలపాలని తమ యూపీఏ సర్కారే నిర్ణయించిందని, దీనివల్ల రెండు రాష్ట్రాలకూ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీకి చెందిన కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఈ బిల్లును సమర్థించగా.. తెలంగాణకు చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని కోరగా.. వామపక్షాలు, ముఖ్యంగా సీపీఎం ఈ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. చివర్లో హోంమంత్రి చర్చకు సమాధానం చెప్తూ.. బిల్లు విషయంలో ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘనా లేదని స్పష్టంచేశారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీ కేకే స్టాట్యుటరీ రిజల్యూషన్‌ను, సవరణ బిల్లును డిప్యూటీ చైర్మన్ ఓటింగ్‌కు పెట్టగా మూజువాణీ ఓటుద్వారా సభ స్టాట్యుటరీ రిజల్యూషన్‌ను తిరస్కరించింది. సవరణ బిల్లును ఆమోదించింది.
 
 అపోహలు అవసరం లేదు: ఏపీ కాంగ్రెస్ ఎంపీలు
 
 చర్చ సందర్భంగా జైరాంరమేష్ మాట్లాడుతూ.. ‘‘ఈ బిల్లుకు మేం సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. తెలంగాణ ప్రజలకు ైెహ దరాబాద్ ఎంత ముఖ్యమో సీమాంధ్ర ప్రజలకు పోలవరం అంతే ముఖ్యం. ఇది బహుళార్ధ సాధక ప్రాజెక్టు. దాదాపు 45 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ముంపు తగ్గించుకునేందుకు తగిన కట్టలు కట్టుకునేందుకు గాను రూ. 600 కోట్లు కేటాయిస్తానని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రస్తుతం నిర్వాసితుల పునరావాసానికి ఈ సవరణ తప్పనిసరి. అందుకే యూపీఏ ప్రభుత్వమే మార్చి 1న జరిగిన కేబినెట్‌లో ఈ ఆర్డినెన్స్ రూపొందించింది. ఆ ఆర్డినెన్సులో అక్షరం పొల్లుపోకుండా ఇప్పుడు ఈ సవరణ బిల్లులో వచ్చింది. సభ్యులెవరికీ అపోహలు అవసరంలేదు. నిర్వాసితులకు మేలైన రీతిలో పునరావాస ప్యాకేజీ అందించాల్సిన అవసరం ఉంది...’’ అని పేర్కొన్నారు. ఏపీ కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి మాట్లాడుతూ కృష్ణా నదీ జలాలతో అనుసంధానం చేయడం ద్వారా రాయలసీమ, తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. విభజన బిల్లును ఆమోదించిన వారు దీన్ని మాత్రం వ్యతిరేకంచడం విచిత్రంగా ఉందని మరో ఎంపీ కె.వి.పి.రాంచంద్రరావు వ్యాఖ్యానించారు. నిర్వాసితులకు మెరుగైన పునరావాసం కోసమే ఈ సవరణ జరుగుతోందని ఇంకో ఎంపీ జె.డి.శీలం పేర్కొన్నారు. టీడీపీ సభ్యుడు సి.ఎం.రమేశ్ మాట్లాడుతూ.. ఈ సవరణ బిల్లు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని, గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు.
 
 గిరిజనులు తుడిచిపెట్టుకుపోతారు: టీ-కాంగ్రెస్ ఎంపీలు
 
 ‘‘ఒడిషా మల్కాన్‌గిరి ప్రజలు ఎందుకు ఏడుస్తున్నారు? చత్తీస్‌గఢ్ జిల్లాలు, తెలంగాణ జిల్లాలు ఎందుకు ఏడుస్తున్నాయి? నాలుగు లక్షల ప్రజలు ఎందుకు ఏడుస్తున్నారో కేంద్రం అర్థం చేసుకోవాలి. కొండరెడ్లు కనీసం భోజనమైనా తీసుకోవడం లేదు. గిరిజనులను ఇబ్బంది పెట్టకూడదని అంతర్జాతీయ సహజ న్యాయం సూత్రం చెప్తోంది. లేదంటే వాళ్లు తుడిచిపెట్టుకుపోతారు. బీజేపీ సోదరులు రామచంద్రుడి పేరు తలచుకుంటారు. కానీ ఆ రాముడి ఆలయాన్నే ముంచే ప్రయత్నం చేస్తున్నారు..’’ అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్ విమర్శించారు. అదే పార్టీకి చెందిన మరో ఎంపీ రేణుకాచౌదరి మాట్లాడుతూ ‘‘ఈ ప్రాజెక్టు ఖమ్మంపై చాలా ప్రభావం చూపుతోంది. గిరిజనులను ముంచుతోంది. వారి హక్కులను కాలరాస్తోంది’’ అని వ్యతిరేకించారు.
 
 మా హృదయం రక్తమోడుతోంది: టీఆర్‌ఎస్
 
 ‘‘మేం పోలవరానికి వ్యతిరేకం కాదు. 2.3 లక్షల మంది గిరిజనులు మీకు పట్టడం లేదు. రాష్ట్రపతి కనీసం అభిప్రాయాలు తీసుకోలేదు. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి ఈ బిల్లును తెచ్చారు. గిరిజనుల బాధ చూస్తుంటే మా హృదయం రక్తమోడుతోంది. సుప్రీంకోర్టు కూడా అడిగింది డిజైన్ మార్చుకోమని. మేం బతిమాలుతున్నాం.. ఒక్కసారి డిజైన్ మార్పు గురించి ఆలోచించండి..’’ అని టీఆర్‌ఎస్ ఎంపీ కె.కేశవరావు విజ్ఞప్తిచేశారు. వీహెచ్ మాట్లాడుతూ డిజైన్ మార్చాలని కోరారు. ‘‘పోలవరం ప్రస్తుత డిజైన్ వల్ల గిరిజనులకు ముప్పు వాటిల్లుతుందని.. డిజైన్ మార్చాలి. మండలాలను బదిలీ చేస్తే.. కేంద్రం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో ఎందుకు మాట్లాడదు? ఏదైనా ప్రజాస్వామ్య యుతంగా ఉండాలి. గిరిజనులకు నష్టపరిహారాన్ని తాజా చట్టాలకు అనుగుణంగా ఇవ్వాలి..’’ సీపీఐ ఎంపీ డి.రాజా కోరారు.
 
 రాజ్యాంగ ఉల్లంఘన లేదు: రాజ్‌నాథ్
 
 పోలవరం సవరణ బిల్లు విషయంలో ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘనా లేదని రాజ్యసభలో చర్చకు బదులిస్తూ రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. ‘‘మే 29వ తేదీన మేంఆర్డినెన్సు జారీ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీలు మనుగడలో లేవు. ఏపీ విడిపోలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలన్నీ రాష్ట్రపతికి పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రపతి సిఫారసు మేరకు (పార్లమెంటు) ఉభయసభల్లో చర్చ జరుగుతోంది. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదు’’ అని వివరించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలోని ఎక్కువ ప్రాంతాలు ముంపుకు గురికాకూడదని ప్రొటెక్టివ్ ఇంబ్యాంక్‌మెంట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ హామీ ఇచ్చిందని చెప్పారు. సాధ్యమైనంత మేర ఎక్కువ ప్రాంతాలు మంపుబారిన పడకుండా చర్యలు తీసుకుంటామని.. ముంపు ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికీ పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
 
 మండలాలిక్కడ.. ఎమ్మెల్యేలక్కడ!
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలపడంతో ఖమ్మం జిల్లాలోని ఏడు పోలవరం ముంపు మండలాలు ఏపీలో చేరనున్నాయి. కూనవరం, చింతూరు, వీఆర్ పురం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా, భద్రాచలం పట్టణం మినహా ఆ మండలంలోని ఇతర గ్రామాలు, బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలు ఏపీలో కలుస్తున్నాయి. ఇవి ఇప్పటిదాకా తెలంగాణలోని భద్రాచలం (సున్నం రాజయ్య), ఆశ్వారావుపేట (తాటి వెంకటేశ్వర్లు), పినపాక (పాయం వెంకటేశ్వర్లు) అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. ఇకపై వీటికి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోనుంది. ఈ మండలాలను ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ స్థానాల్లో కలిపేదాకా ఇదే పరిస్థితి తప్పదు. కానీ అందుకు పార్లమెంటు ఆమోదంతో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి!
 
 పోలవరం బిల్లు ఆమోదంపై స్పందనలు..
 
 తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టారు...
 
 బీజేపీ, టీడీపీలు కలిసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టినయి. పోలవరం డిజైన్ మార్చాలని టీఆర్‌ఎస్ ముందు నుంచి కొట్లాడుతోంది. వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలోభాగంగానే పోలవరం బిల్లు. తెలంగాణలోని బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకుల అలసత్వంతోనే బిల్లు ఆమోదం పొందింది. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాం.    - బాల్క సుమన్, టీఆర్‌ఎస్ ఎంపీ
 
 గిరిజనులు నక్సలైట్లు అవుతారు
 
 పోలవరం డిజైన్ మార్చి ముంపు మండలాలు తగ్గిస్తే రెండున్నర లక్షల మంది గిరిజనుల జీవితాలు బాగుపడతాయని పోరాడినం. ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుంది. గిరిజనులకు సరైన పునరావాసం కల్పించకపోతే వాళ్లంతా నక్స్‌లైట్లుగా మారే ప్రమాదం ఉంది.    - వి.హనుమంతరావు, కాంగ్రెస్ ఎంపీ
 
 మరో నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం
 
 70 ఏళ్ల పోలవరం ప్రాజెక్టు కల ఇప్పుడు నెరవేరబోతుండడం సంతోషకరం. కాంగ్రెస్ సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే ఇంత జరిగింది. టీఆర్‌ఎస్ రాజకీయ లబ్ధికోసం పోరాటం చేస్తోంది.    - సుజనాచౌదరి, టీడీపీ ఎంపీ
 
 శాశ్వత పరిష్కారం లభించింది
 
 పోలవరం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. ప్రాజెక్టు త్వరలో పూర్తికానుండడం సంతోషకరం.    - కంభంపాటి హరిబాబు, బీజేపీ ఎంపీ
 
 బీజేపీ, టీడీపీదే పోలవరం బాధ్యత
 
 తెలంగాణ బీజేపీ, టీడీపీ నేతల నిర్వాకం వల్లనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు మునిగిపోతున్నాయి.    - మంత్రి ఈటెల రాజేందర్
 
 ఆదివాసీలను జలసమాధి కానివ్వం
 
 ఢిల్లీ ధర్నాలో పోలవరం వ్యతిరేక పోరాట కమిటీ

 
 సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నీటి కింద ఆదివాసీలను సమాధి కానివ్వబోమని, ఈ సమస్యను జాతీయసమస్యగా భావించి దేశంలోని ఆదివాసీలందరూ కదిలిరావాలని పోలవరం వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. పునరావాస పథకాలు వద్దని, ఆదివాసీలకు జీవించే హక్కు కల్పించాలని డిమాండ్ చేసింది. ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని నిరసిస్తూ సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, గిరిజన, ఆదివాసీ అనుబంధ సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి. బినామీ కాంట్రాక్టర్లయిన ఎంపీల కోసమే పోలవరమని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాం ఆరోపించారు. గిరిజనులు ప్రకృతి పూజారులని టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బాల్కసుమన్, సీతారాంనాయక్ అన్నారు. ఏపీ, తెలంగాణ పార్టీలు ఒకే వైఖరితో ఉంటే పోలవరం ఆగిపోతుందని సీపీఎం నేతలన్నారు. ముంపు మండలాల విలీనం దుర్మార్గమని సీపీఐ శాసనసభాపక్ష నేత రవీంద్రకుమార్ నాయక్ విమర్శించారు. ఆర్డినెన్‌‌సపై సుప్రీంకు వెళ్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్ తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement