న్యూఢిల్లీ: కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లు(సెంట్రల్ సాంస్కిృట్ యూనివర్సిటీస్ బిల్–2019)కి సోమవారం రాజ్యసభ పలు సవరణలతో ఆమోదం తెలిపింది. డీమ్డ్ యూనివర్సిటీలైన రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్(న్యూఢిల్లీ), శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్(న్యూఢిల్లీ), రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ (తిరుపతి)లను సెంట్రల్ వర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది.
► లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో దేశంలో నెలకొన్న నిరుద్యోగితను సభ్యులు ప్రస్తావించారు. ఎంఎస్సీ గణితం చదివిన వ్యక్తి మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్‌లో స్వీపర్ ఉద్యోగంలో చేరిన విషయాన్ని డీఎంకే నేత ప్రస్తావించారు.
► కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో.. పార్లమెంటు కాంప్లెక్స్‌లో థర్మల్ స్క్రీనింగ్ సౌకర్యాన్ని కల్పించారు. సిబ్బందిని, జర్నలిస్టులను స్క్రీనింగ్ చేస్తున్నారు. పార్లమెంట్‌లోకి సందర్శకులకు అనుమతించడం ఇప్పటికే నిలిపేశారు.
► ఐదు నెలల క్రితం మోటారు వాహనాల సవరణ చట్టం ఆమోదం పొందిన తరువాత.. వాహన ప్రమాదాల్లో మృతి చెందినవారి సంఖ్య 10% తగ్గిందని రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాజ్యసభకు తెలిపారు. (చదవండి: ‘కోవిడ్’ నియంత్రణలో కీలక అడుగు!)
► లోక్‌సభలో అదనపు ప్రశ్నలు అడిగేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బ్యాంకు రుణాలను అత్యధిక మొత్తంలో ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన వారి గురించి ప్రశ్నించానని, ఆ ప్రశ్నకు అనుబంధంగా మరో ప్రశ్న అడిగేందుకు స్పీకర్ అనుమతించలేదని పార్లమెంటు వెలుపల మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment