బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పీడీపీ, బీజేపీల కొత్త ప్రభుత్వం అభివృద్ధి, శాంతి, పునరావాసం ఎజెండాతో ముందుకెళ్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చెప్పారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టడం, విభిన్న వర్గాల్లో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పడం, వరద బాధితులకు పునరావాసం కల్పించడమే ప్రాథమ్యాలుగా కొత్త ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటును పురస్కరించుకుని ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
కొన్ని అంశాల్లో రెండు పార్టీల మధ్య రాజకీయ వైరుద్ధ్యాలున్నప్పటికీ, చర్చల ద్వారా ఏకాభిప్రాయంతో కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమంలో అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 ను అధికారం కోసం పక్కన పెట్టారనే విమర్శలను ఆయన తోసిపుచ్చారు.