ఈ యుద్ధం వెనుక ఏముంది? | Ram Madhav Article On Ukraine And Russia Past Relationship | Sakshi
Sakshi News home page

ఈ యుద్ధం వెనుక ఏముంది?

Published Fri, Mar 4 2022 12:54 AM | Last Updated on Fri, Mar 4 2022 8:51 AM

Ram Madhav Article On Ukraine And Russia Past Relationship - Sakshi

రష్యాలో అతి సాధారణంగా కనిపించే ఇంటిపేరు ‘వ్లాదిమిర్‌’... ఉక్రెయిన్‌లోనూ కనిపిస్తుంది. పుతిన్, జెలెన్‌స్కీ ఇద్దరి పేర్లలోనూ వ్లాదిమిర్‌ ఉండటం గమనార్హం. ఇరు దేశాలకూ అంత దగ్గరితనం ఉంది. అంత ఉమ్మడి చరిత్ర ఉంది. కానీ ఉక్రెయినియన్‌ అనేది ప్రత్యేక జాతి అన్న వాదనను పుతిన్‌ అంగీకరించరు. దాన్ని తమ నుండి వేరు చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయనేది ఆయన వాదన. కానీ శతాబ్దాల పాటు ప్రత్యేక భాష, సంస్కృతితో ఉక్రెయిన్‌ స్వతంత్ర దేశంగా ఉందని ఉక్రెయినియన్ల విశ్వాసం. సోవియట్‌ యూనియన్‌ పతనాన్ని ఒక ‘విపత్తు’గా పరిగణించే పుతిన్‌... రష్యా అన్ని కష్టాలకూ పాశ్చాత్య శక్తులే కారణమని నమ్ముతారు. అందుకే ఈ యుద్ధం వెనుక సంక్లిష్ట చరిత్ర, భావజాలాలు ఉన్నాయి.

ఇది ఇద్దరు వ్లాదిమిర్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం. ఒకరు రష్యాకు తిరుగులేని అధ్య క్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. వ్యూహాలు పన్నడంలో, రాజనీతిజ్ఞతలో దశా బ్దాల అనుభవం ఉన్న బలమైన నాయకుడు. ఇంకొకరు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ. ఉక్రెయిన్‌ అనే చిన్న దేశానికి అధ్యక్షుడు. జన్మతః యూదుడు. రాజకీయవేత్తగా మారిన నటుడు. ఒక శక్తిమంతమైన సైనిక శక్తిగల దేశం, తన కన్నా సగానికి తక్కువ సైన్యం గల ప్రత్యర్థితో జరుపుతున్న యుద్ధం. రెండు అసమాన శక్తుల పోరాటం. 

ఉక్రెయిన్‌లో నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో) దుందుడుకు చర్యల నుండి ఉత్పన్నమవుతున్న భద్రతాపరమైన ఆందోళనల కారణంగా తన చర్యలు ఉన్నాయని పుతిన్‌ వేదన. అయితే ఉక్రెయిన్‌ ‘డీనాజిఫికేషన్‌’పై ఆయన వ్యాఖ్యలు ఇది కేవలం సైనిక యుద్ధం గురించి మాత్రమే కాదని సూచిస్తోంది. దీని వెనక చారిత్రక, సైద్ధాం తిక భావజాలాలు ఉన్నాయి. అందుకే రష్యాలో అతి సాధారణంగా కనిపించే ఇంటి పేరు ‘వ్లాదిమిర్‌’తో దీనికి సంబంధం ఉంది. సహస్రా బ్దాల చరిత్ర గల కీవ్‌ రస్‌ సామ్రాజ్యపు 10వ శతాబ్దపు యువరాజు ‘వ్లాదిమీర్‌ ద గ్రేట్‌’ను ఆధునిక రష్యా పితామహడిగా పరిగణిస్తారు. కానీ ఉక్రెయినియన్లు కూడా క్రీ.శ. 980–1015లో కీవ్‌ రాజుగా ఉన్న ఆయన్నే ఉక్రెయిన్‌ పితామహడిగా భావిస్తారు. ‘వ్లాదిమిర్‌ ద గ్రేట్‌’ వేరువేరు దేశాలకు పితామహడు కాలేడనేది పుతిన్‌ వాదన. 

‘‘చరిత్ర నా పట్ల అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే నేనే చరిత్ర  రాయాలనుకుంటున్నాను’’ అని విన్‌స్టన్‌ చర్చిల్‌ ఓ సంద ర్భంలో చమత్కరించారు. ‘చరిత్ర’ ఎవరు, ఎలా చూపెడుతారు అన్న దానిపై ఆధారపడుతుంది. ఉక్రెయిన్‌ భూభాగంలో రష్యా సేనలు ప్రవేశించడానికి కొన్ని రోజుల ముందు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ పుతిన్‌ చరిత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ఉక్రెయినియన్‌ అనేది ప్రత్యేక జాతి అన్న వాదనను కొట్టిపారేశారు. ‘వ్లాదిమిర్‌ ద గ్రేట్‌’ నిర్మించిన సామ్రాజ్యం ‘రస్‌’లో నివసించిన ప్రజలందరూ రష్యన్లే ననీ, ఉక్రెయినియన్లను వేరు చేసేందుకు ఆస్ట్రో–హంగేరియన్లు, జర్మన్లు, పోల్స్, లిథువేనియన్లు వివిధ చారిత్రక సందర్భాలలో ప్రయత్నించారనీ ముక్తాయించారు.

కానీ ఉక్రెనియిన్లకు తమ సొంత చరిత్ర ఉంది. శతాబ్దాల పాటు ప్రత్యేక భాష, సంస్కృతితో ఉక్రెయిన్‌ స్వతంత్ర దేశంగా ఉందని వారి విశ్వాసం. ‘వ్లాదిమిర్‌ ద గ్రేట్‌’ సామ్రాజ్యం కీవ్, ప్రస్తుత ఉక్రెయిన్‌ రాజధాని, రెండవ సహస్రాబ్దిలో ఒక శక్తిమంతమైన సామ్రాజ్యం అనీ, రష్యన్‌ జార్స్‌ నియంత్రణలో ఎప్పుడూ లేదనీ వారి వాదన. సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ యూని యన్‌(యూఎస్‌ఎస్‌ఆర్‌)లో 1922లో మాత్రమే ఉక్రెయిన్‌ భాగ మైంది. అప్పుడు కూడా ఉక్రెనియిన్‌ కమ్యూనిస్టులు సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (సీపీఎస్‌యూ) నుండి ప్రత్యేక గుర్తింపును కొనసాగించారు. 

యూఎస్‌ఎస్‌ఆర్‌ పతనం సమయంలో, ఆ తరువాతి సంవత్స రాలలో రష్యా అధ్యక్షుడిగా ఉన్న బోరిస్‌ యెల్త్సిన్‌కు పుతిన్‌ అత్యంత విశ్వసనీయుడు. ఆ కృతజ్ఞతతో యెల్త్సిన్‌ 1999లో పదవి వీడుతూ పుతిన్‌ను తన వారసుడిగా ప్రకటించారు. పుతిన్‌ ఒక రష్యన్‌ జాతీయ వాది. సోవియట్‌ యూనియన్‌ పతనం ఒక ‘విపత్తు’ అనేది ఆయన అభిప్రాయం. 1991లో సోవియట్‌ విచ్ఛిన్నంతో సహా రష్యా కష్టాలకు పాశ్చాత్య శక్తులే కారణమని ఆయన నమ్మకం. 

‘టేమ్‌ రష్యా’ (రష్యాను అదుపుచెయ్‌) అనేది గత సహస్రాబ్దిలో అనేక యూరోపియన్‌ శక్తుల ప్రాజెక్ట్‌. ఇది ప్రచ్ఛన్న యుద్ధ కాలం లోనూ కొనసాగింది. సోవియట్‌ యూనియన్‌ను నిలువరించేందుకే 1957 నాటి ‘ఐజెన్‌హోవర్‌ సిద్ధాంతం’! స్టాలిన్‌కూ, అతని వారసు లకూ పశ్చిమ దేశాలపై ఎన్నో అనుమానాలున్నాయి. సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం తొలుత పుతిన్‌ యూరోపియన్‌ యూని యన్‌లో చేరేందుకు ప్రతిపాదించాడు. పశ్చిమ దేశాలతో ఐక్యంగా ఉండేందుకు ప్రయత్నించి భంగపడ్డాడు. ఈ అవమానానికి యూరోపి యన్లకు తగిన గుణపాఠం చెప్పాలని పుతిన్‌ గట్టిగా తీర్మానించు కున్నాడు. 

దీని వెనుక చరిత్రతో పాటు సైద్ధాంతిక కోణమూ ఉంది. పాశ్చాత్య దేశాలు రష్యన్లను అనాగరికులుగా, వారి మత విశ్వాసాలు, రాజకీయాలు హీనమైనవిగా పరిగణించాయి. ప్రతీకారంగా పాశ్చాత్య దేశాల ఉదారవాద రాజకీయాలను పుతిన్‌ తిరస్కరించాడు. డిజిటల్‌ వేదికపై వాటిని అణగదొక్కేందుకు చేయగలిగిందంతా చేశాడు. పుతిన్‌ జాతీయత–సాంస్కృతిక గుర్తింపు... పశ్చిమ దేశాల ఆధునిక భౌగోళిక రాజకీయ జాతీయతకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఉక్రెయిన్‌ ఉదార వాద ప్రజాస్వామ్యం ఆయన రాజకీయ సిద్ధాంత ఓటమికి సంకేతం. ‘రష్యా భాగస్వామ్యంతో మాత్రమే ఉక్రెయిన్‌ నిజమైన సార్వభౌమాధి కారం సాధ్యమవుతుంది’ అనేది పుతిన్‌ ఉద్ఘాటన.

కమ్యూనిస్టులు మతాన్ని వ్యతిరేకించారు. హిట్లర్‌ను నిలువరించ డానికి పోప్‌ మద్దతును సమీకరించాలని 1943 తెహ్రాన్‌ కాన్ఫరెన్స్‌లో చర్చిల్‌ సూచించినప్పుడు, ‘పోప్‌కి ఎన్ని సైనిక విభాగాలు ఉన్నాయి?’ అని స్టాలిన్‌ ప్రముఖంగా అడిగారు. పుతిన్‌ మతానికి వ్యతిరేకం కాదు. కానీ ఉక్రేనియన్లను తమ నుండి దూరం చేసి రష్యన్‌ ఆర్థొడాక్స్‌ మత గుర్తింపును బలహీన పరిచేందుకు క్యాథలిక్‌ శక్తులు ప్రయత్నిస్తున్నా యని ఆయన అనుమానం. యాదృచ్ఛికంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఒక యూదుడు కావడం పుతిన్‌ అనుమానానికి బలం చేకూర్చింది.

ఈ యుద్ధం వెనుక ఉన్న సంక్లిష్ట చరిత్ర, భావజాలమే భారతదేశ సంకట స్థితికి కారణం. ఒకపక్క టిబెట్, తైవాన్‌ సహా పలు ప్రాంతా లను తమవిగా చెప్పుకుంటోన్న చైనా వైఖరిని తిరస్కరించే భారత్, ఉక్రెయిన్‌ ప్రత్యేక దేశం కాదన్న పుతిన్‌ వాదనను సమర్థించలేదు. అదే సమయంలో నాటో దేశాల రెచ్చగొట్టే చర్యల నేపథ్యంలో రష్యా భద్రతాపర ఆందోళనలనూ పూర్తిగా తిరస్కరించనూలేదు. 

నేడు ప్రపంచం పుతిన్‌ చర్యలను వ్యతిరేకిస్తుంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకించడంలో భారతదేశం ఒక దృఢ సైద్ధాంతిక వైఖరిని తీసుకుంది. కానీ, ఐక్యరాజ్యసమితిలో చైనా, మనం ఇంచు మించు ఒకే వైఖరి తీసుకోవడం ప్రపంచ దేశాలను కలవరపరు స్తోంది. ఎంతో విశిష్టమైన మన గొప్ప ప్రజాస్వామ్య దేశం ఎంత కాలం ఈ తటస్థ వైఖరిని కొనసాగించగలదు? 

వ్యాసకర్త: రామ్‌మాధవ్‌
ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement