రష్యా ఉన్నట్లుండి ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించింది. అయితే ఇది ఆకస్మిక ఘటన కాదు. ఎనిమిదేళ్ల క్రితం క్రిమియాను ఆక్రమించుకుని డాన్‌బాస్ నుంచి రష్యా తన చర్య లను మొదలెట్టినప్పుడే ఈ క్రమం మొదలైంది. ఉక్రెయిన్ ప్రజలు దీనికి ఎన్నడూ అంగీకరించలేదు. యుఎస్‌ఎస్‌ఆర్ సామ్యవాద పాలనలో ఉక్రెయిన్ విధ్వంసకర ఫలితాన్ని అనుభవించింది. 1932–33 మధ్యలో ఘోర కరువు కారణంగా 30 నుంచి 40 లక్షల మంది చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సొంత దేశాన్ని రూపొందిం చుకోవడం కోసం ఉక్రెయిన్ పోరాడుతూ వచ్చింది. ఉక్రెయిన్ స్వాతంత్య్ర ప్రకటన చట్టాన్ని 90.92 శాతం ఓటర్లు ఆమోదించారు. కానీ పుతిన్ తన నయా సామ్రాజ్యవాద శైలితో ఉక్రెయిన్ స్వతంత్రతను నిరాకరిస్తున్నారు. రష్యాను వాస్తవంలోకి తీసుకురావడంలో తక్కిన ప్రపంచంతోపాటు భారతదేశం కూడా తోడ్పడాలి.
రష్యా ముట్టడికి గురైన నా మాతృదేశం ఉక్రెయిన్ పూర్తిస్థాయి యుద్ధంలో పాల్గొంటున్న సమయంలో ఈ వ్యాసం రాస్తున్నాను. ఇలాంటిది సంభవిస్తుందని నాకు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు. మా సరిహద్దుల్లోనే కాదు, బెలారస్ భూభాగం నుంచి కూడా రష్యా మాపై బహుముఖ యుద్ధం తలపెట్టింది. రష్యన్ క్షిపణులు మా రాజధాని కీవ్‌ను తాకాయి. పలుదిక్కుల నుంచి రష్యా ట్యాంకులు మా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించాయి. కొన్ని మార్గాల్లో రష్యన్ సైనిక చర్య విజయవంతమైంది. కానీ వీటిలో చాలా వాటిని ఉక్రెయిన్ సైనికులు తిప్పికొట్టారు. ఈ క్రమంలో రష్యన్ ఆర్మీ ఎదురుదెబ్బలు తింది. అనేక సైనిక వాహనాలను కోల్పోయింది కూడా.
నిద్రలేకుండా అలసిపోయిన నేను కళ్లు మూసుకున్నప్పుడు చుహుయివ్‌లోని అపార్ట్‌మెంట్ బ్లాక్ సమీపంలో తన కొడుకు కోసం విలపిస్తున్న ఓ తండ్రి మొహాన్ని తల్చుకున్నాను. రష్యా దాడిలో చనిపోయిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. యూరప్ మధ్యలో ఉన్న మా దేశానికి ఈ 21వ శతాబ్దిలో ఇలా జరుగుతుందంటే నమ్మశక్యంగా లేదు. ఫిబ్రవరి 24న రష్యా ఉన్నట్లుండి ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారం భించింది. ఇది ఆకస్మిక ఘటన కాదు. ఎనిమిదేళ్ల క్రితం క్రిమియాను ఆక్రమించుకుని డాన్‌బాస్ నుంచి తన చర్యలను రష్యా మొదలెట్టి నప్పుడే ఈ క్రమం మొదలైంది.
గత శతాబ్ది కాలంగా ఉక్రెయిన్‌ను తన అదుపులో ఉంచుకోవా లని రష్యా నిరంతరం ప్రయత్నిస్తూ వచ్చిందన్నది ఇప్పుడు మరింత స్పష్టంగా తేటతెల్లమైంది. ఇతర సెంట్రల్ యూరోపియన్ దేశాల లాగే ఉక్రెయినియన్లు కూడా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత తమ సొంత దేశాన్ని రూపొందించుకోవడం కోసం పోరాడుతూ వచ్చారు. ఆ ప్రయత్నాల్లో మేం విజయవంతమయ్యాం. 1918 జనవరిలో స్వతంత్రం ప్రకటించుకుని ఒక సంవత్సరం తర్వాత పశ్చిమ ఉక్రెయిన్ రిపబ్లిక్‌తో ఐక్యమయ్యాం. కానీ ఇతర సెంట్రల్ యూరోపియన్ దేశా లకు లాగే మా సొంత దేశంలో జీవిస్తూ ఆనందంగా గడిపే అవకాశం పెద్దగా పొందలేకపోయాం.
1920లో బోల్షివిక్కులు, రెడ్ ఆర్మీ (పోలండ్‌లో భాగంగా మారిన పశ్చిమప్రాంతం మినహా) ఉక్రెయిన్‌పై అదుపు సాధించగలిగాయి. ఉక్రెయిన్‌లో సోవియట్ పాలన ఇలా ప్రారంభమైంది. ప్రత్యేక దేశంగా ఉక్రెయిన్ ఉనికిని సోవియట్ అధికారులు ఎన్నడూ గుర్తించలేదనే విషయమై చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం ఉంది. అందుకే ఉక్రె యినియన్లు, రష్యన్లు ఒకే ప్రజలు అనీ, అసలు ఉక్రెయిన్‌ని సృష్టిం చింది వ్లాదిమిర్ లెనిన్ అనీ చెప్పడం ద్వారా ప్రస్తుత రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన నయా సామ్రాజ్యవాద శైలితో ఉక్రెయిన్ స్వతంత్రతను నిరాకరిస్తున్నారు.
యుఎస్‌ఎస్‌ఆర్ సామ్యవాద పాలనలో భాగంగా ఉక్రెయిన్ విధ్వంసకర ఫలితాన్ని అనుభవిస్తూ వచ్చింది. 1932–33 మధ్యలో ఉక్రెయినియన్లు కరువు బారిన పడ్డారు. ఈ ఘోర కరువు కారణంగా 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఆనాటి జనాభాలో ఇది 13 శాతం. అప్పట్లో సోవియట్ సమష్టీకరణ విధానాల కార ణంగా ఉక్రెయిన్ రైతాంగం తాము పండించిన పంటను బలవం తంగా సోవియట్ అధికారులకు అప్పగించాల్సి వచ్చింది. ఆహారం కోసం అన్వేషిస్తూ తమ గ్రామం నుంచి బయటకు వెళ్లడానికి కూడా వారిని అనుమతించేవారు కాదు. రైతులు ఆహారం సేకరించడాన్ని నిషేధించారు. ఇలా సేకరించినవారిని నిర్బంధ శిబిరాలకు చేర్చి అయిదు నుంచి పదేళ్ల వరకు ఉంచేవారు. వీరిలో చాలామంది ఆకలిదప్పులతో చనిపోయేవారు.
ఈ సందర్భంగా, నా భర్త కుటుంబం ఆయన ముత్తవ్వ గురిం చిన భయంకర గాథను పదిలపర్చి నాకు చెప్పింది. ఒక సంపన్న కుటుంబం బయటకు విసిరేసిన బంగాళా దుంపల పొట్టును తీసు కున్నదని ఆమెను నిర్బంధ శిబిరానికి తరలించారు. దాంతో పిల్లలకు కాస్త తిండి పెడదామని ఆమె భావించింది. ఆ రోజుల్లో అనేకమంది మేధావులు, సంగీతకారులు, విద్యావేత్తలను ఇలా నిర్బంధ శిబిరా లకు పంపేవారు. అక్కడ వారి జీవితం విషాదకరంగా ముగిసేది. రెండో ప్రపంచ యుద్ధం ఉక్రెయిన్‌కి విధ్వంసకరమైన నష్టాలను తీసుకొచ్చింది. చరిత్రకారుడు తిమోతీ స్నైడర్ పేర్కొన్న ‘బ్లడ్‌లాండ్స్’ మధ్యలో ఉక్రెయిన్ ఉంది. అంటే పోలండ్ నుంచి పశ్చిమ రష్యా వరకు వ్యాపించిన భూభాగంగా ఉక్రెయిన్ ఉండటంతో సోవియట్లు, నాజీలు ఇద్దరి చేతుల్లో నానా బాధలకు గురవుతూ వచ్చింది.
1980ల చివరికి ‘గ్లాస్‌నాస్త్’, ‘పెరిస్త్రోయికా’లు(కమ్యూనిస్టు పార్టీలో, ప్రభుత్వంలో సంస్కరణలు) మార్పును తీసుకొచ్చాయి. వాటితోనే ఉక్రెనియన్లు ఉత్తేజం పొందారు. ఆసక్తికరంగా మొదటి అడుగు డాన్‌బాస్ నుంచి పడింది. 1989–90లలో డాన్‌బాస్ బొగ్గుగని కార్మికులు భారీ సమ్మెకు దిగారు. కారణం ఆర్థికమే. చాలాకాలంగా వీరికి వేతనాలు చెల్లించలేదు. పని పరిస్థితులు పేలవంగా ఉండేవి. మాస్కో నుంచి కాకుండా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి దీనిపై నిర్ణయాలు వస్తే బాగుంటుందని వీరు భావించారు. ఇలాంటి నిరసన ప్రదర్శనలే యుఎస్‌ఎస్‌ఆర్ పతనానికీ, ఉక్రెయిన్ స్వాతంత్య్రానికీ నాందీవాచకంలా ఉండేవి. 1991 డిసెంబర్ 1న ఉక్రెయిన్ స్వాతంత్య్ర ప్రకటన చట్టాన్ని ‘మీరు ఆమోదిస్తారా, లేదా?’ అనే ప్రశ్నకు 90.92 శాతం ఓటర్లు (క్రిమియాలో నివసిస్తున్న వారితో సహా) ‘అవును’ అని ఓటేశారు. సరిగ్గా వారంరోజులకు యుఎస్‌ఎస్‌ఆర్ రద్దయిపోయింది.
ఆ తర్వాత గడిచిన 30 సంవత్సరాల స్వాతంత్య్రం సజావుగా సాగలేదు. కానీ ఉక్రెయిన్ తన శాంతియుత వైఖరిని నిరూపించు కుంది. యుఎస్‌ఎస్‌ఆర్ రద్దు సమయానికి ఉక్రెయిన్ ప్రపంచంలోనే మూడో అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఉండేది. కానీ కీవ్ తన వద్ద ఉన్న అన్ని రకాల అణ్యాయుధాలను వదిలి పెట్టింది. దీనికి ప్రతిఫలంగా 1994లో బుడాపెస్ట్ మెమోరాండంపై అమెరికా, బ్రిటన్‌తోపాటు రష్యా కూడా సంతకం పెట్టింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సార్వభౌమత్వానికి ఈ ఒప్పందం హమీనిచ్చింది. 1997లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ లియెునిద్ కుచమా, రష్యన్ అధ్యక్షుడు బోరిస్ ఎల్ట్సిన్ రెండు దేశాల మధ్య స్నేహ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గుర్తించిన ద్వైపాక్షిక ఒప్పందాలు ఇవే.
2014 నుంచి ఉక్రెయిన్ చాలా మారింది. యుద్ధంతో సహవాసం చేస్తున్నప్పటికీ అది అనేక అవకాశాలతో మరింతగా యూరోపియన్ దేశంగా మారిపోయింది. యూరోపియన్ యూనియన్‌తో సమగ్ర వాణిజ్య ఒప్పందం, వీసా రహిత వ్యవస్థ వల్ల మా వ్యాపారవేత్తలకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే ఉక్రెయిన్ ప్రజాస్వామిక దేశంగా మారింది. రష్యా పాలకుల విష యానికి వస్తే, తన ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్న వీరికి తమ పొరుగున ప్రజాస్వామిక వ్యవస్థ ఉండటం ఏమాత్రం సమ్మతం కాదు. అందుకే ఉక్రెయిన్ ప్రజలు యూరోపియన్, నాటో కూటమిలో చేరాలని ఆత్రుత ప్రదర్శించేవారు. ఇటీవల జరిగిన ఒక పోల్ ప్రకారం 67 శాతంమంది ఉక్రెయినియన్లు ఈయూలో చేరాలని కోరుకోగా, నాటోలో చేరాలని 59.2 మంది కోరుకున్నారు. ఈ గణాంకాలే రష్యన్ దురాక్రమణకు దారితీశాయి. 2013లో ఉక్రెయినియన్లలో 20 శాతం కంటే తక్కువ మంది మాత్రమే నాటోలో చేరాలని ఓటేశారు.
కానీ ప్రస్తుతం పుతిన్ తలపెట్టిన దాడి ఉక్రెయినియన్లను మరింత దేశభక్తిపరులుగా మార్చింది. కొన్ని రోజుల క్రితం మొదలైన పూర్తి స్థాయి యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలు తమ పొరుగుదేశాన్ని దీర్ఘకాలంపాటు ద్వేషించే పరిస్థితి మరింత పెరిగింది. ఉక్రెయిన్‌తో రష్యా తలపెట్టిన యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన నిరసన ప్రదర్శనలు రష్యన్ ప్రజల్లో కూడా మార్పు తీసుకొస్తాయని ఆశ కలుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు చేసినట్లుగానే తెల్లవారు జామున 4 గంటలకు పిరికిపందలాగా రష్యా యుద్ధం తలపెట్టింది. వందలాదిమంది రష్యన్ తల్లులు తమ పిల్లలను కోల్పోయారు.
మరోవైపు భారతదేశం ఈ యుద్ధం గురించిన ప్రకటనల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ వస్తోంది. అవును, భారతదేశానికి బాధాకరమైన చరిత్ర ఉంది. కాబట్టే ఉక్రెయిన్‌పై రష్యా ప్రకటనలను అర్థం చేసు కోవడంలో అది మనకు తోడ్పడుతుంది. క్రెమ్లిన్ తన సామ్రాజ్యాన్ని తిరిగి పొందాలని చూస్తూ ఉక్రెయిన్‌ని ఈ సామ్రాజ్యంలో ఒక ఆభరణంగా చూస్తోంది. ఉక్రెయిన్ ప్రజలు దీనికి ఎన్నడూ అంగీక రించలేదు. బ్రిటన్ ఇప్పుడు తన సామ్రాజ్యంలో భారతదేశం ఒక భాగమని చెబుతుందని ఊహిద్దాం. అది అసంభవం కదా! కానీ రష్యా ఇప్పుడు చేస్తున్నది అదే మరి. ఈ అసాధ్యాన్ని సాధించు కోవడానికి రష్యా ఇప్పుడు రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఎన్నడూ చూడని స్థాయిలో ఉక్రెయిన్ నగరాలపై, రాజధాని కీవ్‌పై క్షిపణులు సంధిస్తోంది. అందుకే రష్యాను వాస్తవంలోకి తీసుకురావడంలో దయ చేసి మాకు సహాయం చేయండి.
– ఓల్హా వొరోజ్‌బిట్
ఉక్రెయిన్ పాత్రికేయురాలు
Comments
Please login to add a commentAdd a comment