ఈ యుద్ధంలో శృంగభంగం ఎవరికి? | MK Bhadrakumar Article Russia Ukraine War | Sakshi
Sakshi News home page

ఈ యుద్ధంలో శృంగభంగం ఎవరికి?

Published Fri, Jul 22 2022 12:06 AM | Last Updated on Fri, Jul 22 2022 12:06 AM

MK Bhadrakumar Article Russia Ukraine War - Sakshi

ఉక్రెయిన్‌ యుద్ధంతో రష్యా పనయిపోయిందనీ, పుతిన్‌ నుంచి అధికారం  చేతులు మారనుందనీ, రష్యన్లు తమ ప్రభుత్వాన్ని ఏవగించుకుంటున్నారనీ, గత కొన్ని నెలలుగా పాశ్చాత్య మీడియా ఊదరగొట్టింది. ఈ ప్రచారంలో ఏ హేతువూ లేదని తేలిపోతోంది. రష్యాలో అధికారం చేతులు మారడం మాట అటుంచి, అమెరికా విశ్వసనీయత, నాటో వైఖరే ఇప్పుడు ప్రమాదంలో పడింది. యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థలు మెల్లగా ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశిస్తున్నాయి. రష్యాపై అవి విధించిన ఆంక్షలు వారికే ఎదురు తన్నుతున్నాయి. యుద్ధం అనివార్యంగా తీసుకొచ్చే అలసట పాశ్చాత్య కూటమిలో చీలికలను తెచ్చే సూచనలు కనబడుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఆవరణలో రష్యా తిరిగి పైచేయి సాధించనుందని అమెరికా భయపడుతోంది.

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా పనయిపోతోం దంటూ పాశ్చాత్య ప్రపంచం సాగిస్తున్న ప్రచారం, ప్రచ్చన్నయుద్ధ కాలంలో కూడా ఇంత తీవ్రస్థాయిలో జరిగి ఉండదు. దీనికి తోడుగా విరుద్ధమైన వార్తలను తొక్కిపెట్టడం లేదా తుడిచిపెట్టేయడం ద్వారా రష్యా తన సైనిక చర్యలకు సంబంధించి పూర్తిగా విఫలమైందంటూ ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ రకమైన అంచనా ఏ స్థాయికి వెళ్లిందంటే, రష్యన్‌ ప్రజల్లో తీవ్ర అసమ్మతి పెరిగిన కారణంగా రష్యాలో ప్రభుత్వ మార్పు అనివార్యమని చెప్పేంతవరకూ! ప్రజల జీవితాలను ధ్వంసం చేసి, ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన విధ్వంసకరమైన యుద్ధంలో రష్యా చిక్కుకు పోయిందనీ, అదే రష్యన్ల అసమ్మతికి కారణమైందనీ పాశ్చాత్య దేశాలు ప్రచారం చేస్తూవచ్చాయి. వాస్తవానికి ఈ యుద్ధంలో రష్యా వ్యతిరేక పాశ్చాత్య కూటమి బీటలు వారుతున్నట్లు కనిపిస్తోంది. యూరోపియన్‌ దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలు ఆ దేశాలను ఇలా దెబ్బ కొట్టాయన్న మాట. రష్యన్‌ సైనిక, రాజకీయ ఉద్దేశాలకు సంబంధించి పాశ్చాత్య నిఘావర్గాలు దారుణ వైఫల్యం చెందాయి. 

మార్చి నెలలో కీవ్‌ నుంచి, ఉక్రెయిన్‌ ఉత్తర ప్రాంతాలనుంచి సైనిక ఎత్తుగడల కారణంగా రష్యన్‌ బలగాలు వెనక్కు తిరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విజయసూచకంగా పోలండ్‌లో కాలు మోపి, పక్కనే క్రెమ్లిన్లో ఉన్న రష్యన్‌ ప్రభుత్వానికి వినిపించేలా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పతనాన్ని ప్రకటించేశారు. ఉక్రెయిన్‌లో సైనిక ఘర్షణ ఒక కొసకు చేరింది కానీ ఫలితం వేరేలా ఉంది. యుద్ధంలో నష్టపోవడం రష్యాకు అలవాటు లేదు. లేదా సుదీర్ఘ యుద్ధం కొనసాగించగల అనంతమైన సామర్థ్యం కలిగిన దాని చరిత్ర నిస్సందేహంగా ఈ వాస్తవాన్ని రుజువు చేస్తోంది. ఇది రష్యాకు తన ఉనికికి సంబంధించిన ఘర్షణ. ఇక అమెరికా, నాటోలకు అయితే, రష్యాను బలహీనపర్చడానికి 2014 నుంచి ప్లాన్‌ చేసి, అమలు పర్చిన సైనిక కుట్రలో చివరి ఆట మాత్రమే. నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోలెన్బెర్గ్‌ ఇటీవలే నర్మగర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టారు కూడా. ఏ దేశమైనా భౌగోళిక రాజకీయపరంగా దెబ్బ తిన్న తర్వాత కూడా రష్యన్‌ సమాఖ్యలాగా కోలుకుని తిరిగి పైకి లేవగలదు. కానీ నెపోలియన్‌ లేదా హిట్లర్‌ చేతుల్లో ఓడిపోయి ఉంటే రష్యా చరిత్ర మరో రకంగా ఉండేది. చారిత్రక దృక్పథంలో నుంచి చూస్తే ఉక్రెయిన్‌ సైనిక ఘర్షణలో కీలకమైన అంశం ఇదే మరి.

పాశ్చాత్య దేశాల ప్రచారంలోని ఈ భ్రమాత్మకమైన విజయో త్సాహం హేతుబద్ధ ఆలోచననే మసకబార్చింది. వాస్తవానికి అమెరికాకు అందుబాటులో ఉన్న హేతుపూర్వకమైన అవకాశం ఏమిటంటే, ఈ సైనిక ఘర్షణకు ముగింపు పలకడమే. ఉక్రెయిన్, రష్యా ప్రతినిధి బృందాలు ఇస్తాంబుల్‌లో సమావేశమై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పుడు, మాస్కో అంచనాలకు అను గుణంగానే ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేయాలనీ, తటస్థ స్థితిని పాటించాలనీ, విడిపోయిన రెండు డోన్బాస్‌ రిపబ్లిక్కుల స్వాతంత్య్రాన్ని గుర్తించాలనీ, క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా కూడా గుర్తించాలనీ ఇరుదేశాల మధ్య దాదాపుగా ఒప్పందం కుదిరినట్లుగా కనిపించింది. అది అమెరికాకు కూడా ఆమోద నీయమైన ఒప్పందంగా ఉండేది కానీ రష్యాను చిత్తుగా ఓడించ గలమనీ, క్రెమ్లిన్‌లో ప్రభుత్వ మార్పిడి కూడా జరిగిపోతుందనే భారీ అంచనాలతో మత్తెక్కి ఉన్న బైడెన్‌ పాలనా యంత్రాంగం కీవ్‌లోని తోలుబొమ్మ ప్రభుత్వాన్ని నమ్ముకుని ఇస్తాంబుల్‌ ఒప్పందాన్ని కుదరనీయకుండా చేసింది.

ఆ తర్వాత సైనిక ఘర్షణ కొత్త దశకు చేరుకుంది. మరీయూ పోల్‌లో రష్యా విజయం సాధించడమే కాదు, అజోవ్‌ సముద్రంపై కూడా పట్టు సాధించింది. డోన్బాస్‌ పాలనా సరిహద్దుల వెనక్కు ఉక్రెయిన్‌ బలగాలు తిరిగిపోయేలా తీవ్ర దాడిని ప్రారంభించింది. దీంతో 2014లో ఉక్రెయిన్‌ ప్రభుత్వం తలపెట్టిన కుట్రకు ముందునాటి పరిస్థితులు తిరిగి ఏర్పడ్డాయి. తాజాగా సెవరెదోనెట్స్క్‌– లీసిచాన్స్క్‌ ప్రాంతంలో సాధించిన అద్భుత విజయాలతో, వెనువెంటనే స్లావ్యాన్స్క్, క్రామతోర్స్క్‌ ప్రాంతాలపై కూడా రష్యా దాడి మొదలెట్టింది. దీంతో ఉక్రెయిన్‌ బలగాల చివరి రక్షణ పంక్తి కూడా మరి కొన్ని వారాల్లో విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడటం ఈ మొత్తం యుద్ధంలో చివరి ముగింపు కానుంది. మొత్తంమీద ఈ సైనిక ఘర్షణ బైడెన్‌ యంత్రాంగం విశ్వసనీయతనూ, నాటో వైఖరినీ దెబ్బతీసింది. వాస్తవానికి అమెరికా  యుద్ధానికి ముగింపు పలికే స్థానంలో ఉండి కూడా అలా చేయలేకపోయింది.

ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితి ప్రపంచ ప్రేక్షకుల ముందు అమెరికా శక్తికున్న పరిమితులను బహిర్గతం చేస్తుందనీ, భౌగోళిక రాజకీయ ఆవరణలో రష్యా తిరిగి పైచేయి సాధించనుందనీ బైడెన్‌ యంత్రాంగం భయపడుతోంది. పైగా బహళ ధ్రువ ప్రపంచానికి అనుకూలత అనివార్యం అయేటట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో చైనా అగ్రరాజ్యంగా ఎదిగే ప్రమాదం పొంచి ఉందని అమెరికా భీతిల్లుతోంది. మరో విషయం ఏమిటంటే, యుద్ధం అనివార్యంగా తీసుకొచ్చే అలసట పాశ్చాత్య కూటమిలో చీలికలను తీసుకువస్తున్న సూచనలు కనబడుతున్నాయి. యూరోపియన్‌ ఆర్థికవ్యవస్థలు మెల్లగా ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశిస్తున్నాయి. రష్యాపై అవి విధించిన ఆంక్షలు బూమెరాంగ్‌గా వారికే ఎదురు తన్నుతున్నాయన్న మాట. అంతకు మించి, రష్యా ఒక కొత్త వ్యవస్థను ఏర్పర్చబోతోంది. ఇది అమెరికా ట్రాన్స్‌ అట్లాంటిక్‌ నాయకత్వంపై భవిష్యత్తులో తీవ్రమైన ఫలితాలను తీసుకురానుంది. 

అలాగే, ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆంగ్లో–అమెరికన్ల కాళ్లకింది నేల నాటకీయంగా మార్పు చెందుతోంది. ఈ తరుణంలో ఒప్పందం కుదిరితే ఇస్తాంబుల్‌లో ఆనాడు కుదిరిన ఒప్పందానికి అనుగుణంగానే ఉండబోతుంది. నిజంగానే  ఇప్పుడు డోన్బాస్‌ పాలనా సరిహద్దులను నిర్ణయించిన 2014 నాటి ఒప్పందాన్ని పాశ్చాత్యకూటమి యథా తథంగా అంగీకరించాల్సి ఉంటుంది. అంతే కాకుండా... క్రిమియాను రష్యా లోతట్టుప్రాంతంతో అనుసంధానించడం ద్వారా ఖేర్సన్, జొపోరోజియాతో పాటు క్రిమియా ఉత్తర ప్రాంతంలోకి రష్యా సులువుగా కాలు మోపేందుకు కూడా అంగీకరించాల్సి ఉంటుంది. పైగా పాశ్చాత్య దేశాలు తనపై విధించిన అన్ని ఆంక్షలను తొలగించాలని కూడా రష్యా డిమాండ్‌ చేసే అవకాశం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

స్పష్టంగానే అలాంటి లొంగుబాటును అంగీకరించినట్లయితే ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీ ప్రభుత్వం కుప్పగూలడం ఖాయం. అదే సమయంలో ఉక్రెయిన్‌లో 2014 నుంచి అమెరికా నిఘా సంస్థ సీఐఏ అమలు చేస్తున్న కుట్ర మొత్తంగా భగ్నమైపోతుంది. ఉక్రెయిన్‌ రాజకీయాల్లో నాటి అధ్యక్షుడు ఒబామా తరపున తలదూర్చి 2014 కుట్రలో భాగం పంచుకున్న బైడెన్‌కు ఈ పరిణామం రాజకీయంగా తలనొప్పిని తెచ్చిపెడుతుంది. 2024లో అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యే అవకాశం లేకుండా పోతుంది. ఉక్రెయిన్‌లో జరగనున్న చివరి పరిణామంలో పాస్‌ కావాలని బైడెన్‌ భావిస్తున్నారు. యుద్ధం ద్వారా లాభాలను ఆశిస్తున్న వారి వైఖరీ ఇదే. అత్యధు నాతనమైన పాశ్చాత్య ఆయుధ వ్యవస్థలతో కూడిన రైలు ఉక్రెయిన్‌ వైపు పరుగెడుతున్నప్పుడు అక్కడి బ్లాక్‌ మార్కెట్‌ లక్షా 20 వేల డాలర్ల లాభాలపై కన్నేసి ఉంటోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం వచ్చే శరదృతువు నాటికి మరొక చివరి పరిణామం కోసం వేచి ఉండాల్సి వస్తుంది.


ఎం.కె. భద్రకుమార్‌
వ్యాసకర్త మాజీ రాయబారి
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement