
వచ్చే ఏడాదే రామమందిరం: స్వామి
అయోధ్య: వివాదాస్పద అయోధ్య రామమందిర విషయాన్ని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మళ్లీ లేవనెత్తారు. వచ్చే ఏడాది రామమందిరం నిర్మాణం ప్రారంభం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రామాలయ నిర్మాణం విషయంలో తమకు అనుకూల తీర్పు వస్తుందని నమ్ముతున్నానని, ఈ ఏడాది నవంబర్‌నాటికి ఆ తీర్పు విషయంలో స్పష్టత వస్తుందని తాను భావిస్తున్నానని చెప్పారు.
ఆదివారం విశ్వ సంవాద్ కేంద్రం నిర్వహించిన నరద్ సమ్మాన్ సమరో కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామమందిరంపై ఇలా వ్యాఖ్యానించారు. రామమందిరం, బాబ్రీ మసీదు వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందన్న ఆయన నవంబర్ నాటికి క్లియర్ అవుతుందనుకుంటున్నానని చెప్పారు. 2024నాటికి రామాలయం నిర్మాణం ప్రారంభమవుతుందని గత మార్చిలో స్వామి చెప్పిన విషయం తెలిసిందే.